ఇదిగో అదిగో అంటూ కొన్ని నెలలుగా ఊరిస్తున్నారే తప్ప.. ఇంతవరకు కమలం పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చింది లేదు. అయితే త్వరలోనే కొత్త బాస్ వస్తారంటూ పార్టీ సంకేతాలు ఇస్తోంది. అనేక లిస్టులు, సమీకరణాల పరిశీలన తర్వాత ఫైనల్ లిస్ట్ అధిష్టానం దగ్గరకు చేరింది. ఆ లిస్ట్‌లో ఉన్న వారిలో ఒకరు ఈ నెల చివరిలోగా అధ్యక్షుడిగా రాబోతున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టడమే ఆ పార్టీ లక్ష్యం. దీని కోసం గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటోంది. ఇప్పటికే సంస్థాగతంగా పార్టీ పదవులను భర్తీ చేస్తోంది. రాష్ట్రాన్ని బీజేపీ 38 జిల్లాలుగా విభజించుకున్న బీజేపీ.. 36 జిల్లాలకు కొత్త అధ్యక్షులను ఎన్నుకుంది. జిల్లా అధ్యక్షుల ఎంపిక దాదాపు పూర్తవడంతో స్టేట్ ప్రెసిడెంట్‌గా ఎవరిని నిలబెట్టేందుకు ఢిల్లీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు.
రేసులో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ.. పరిశీలనలో రాంచందర్‌రావు పేరు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణతో పాటు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేరు షార్ట్ లిస్ట్ అయినట్టు తెలుస్తోంది. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. తాను అధ్యక్ష రేసులో లేనని గతంలో బండి సంజయ్ స్వయంగా చెప్పారు. కానీ అధిష్టానం పరిశీలనలో ఆయన పేరు కూడా ఉన్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వీళ్లలో ఎవరిని నియమిస్తే కమల వికాసం సాధ్యమవుతుందని.. హైకమాండ్ తీవ్ర సమాలోచనలు చేస్తోంది.
పరిశీలకురాలుగా ఉన్న శోభా కరంద్లాజే
రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక నేపథ్యంలో అభిప్రాయాల సేకరణ అధిష్టానం చేస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల పరిశీలకురాలుగా ఉన్న శోభా కరంద్లాజే ఇప్పటికే రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాన్ని తీసుకున్నారు. పార్టీ నేతల అభిప్రాయాలు, సమీకరణాలను బేరీజు వేసుకుని కమలం పార్టీకి కొత్త బాస్‌ను నియమించనున్నారు ఢిల్లీ పెద్దలు.
సంఘ్ పరివార్ మద్దతుతో కొందరి ప్రయత్నాలు
మరోవైపు మరికొంత మంది ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా అమిత్ షా, నడ్డాను కలిసిన వారిలో ఎంపీలతో పాటు పలువురు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. వాళ్లలో కొంత మంది అధిష్టానం దృష్టిని ఆకర్షించే పనిలో ఉన్నారు. సంఘ్ పరివార్ మద్దతుతో మరికొంతమంది నేతలు తమ పేర్లను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉగాది నాటికి రానున్న కొత్త అధ్యక్షుడు
తెలుగు కొత్త సంవత్సర నాటికి.. అంటే ఉగాది నాటికి కొత్త అధ్యక్షుడి రాక ఉంటుందని.. నూతనోత్సాహంతో కమలం తెలంగాణలో వికసిస్తుందని కేడర్ కోటి ఆశలతో ఎదురుచూస్తోంది. అయితే ఆశావహులు మాత్రం చివరి నిమిషంలో సైతం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..