- ప్రభుత్వ స్కూళ్ల స్థితిగతులు
- విద్యా శాఖ బాధ్యత ఎవరిది?ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల నమ్మకం తగ్గినదా? : పైడి రాకేశ్ రెడ్డి

Paidi Rakesh Reddy : తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం 26 వేల మందిని మాత్రమే రిక్రూట్ చేసిందని, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే క్రెడిట్ తీసుకుంటుందని విమర్శించారు. “అంతమందిని రిక్రూట్ చేశారని చెబుతున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ ఔట్స్ పెరగడం ఏమిటి? గతంలో ఒక్కటే కాలేజీ ఉండేది. ఇప్పుడు 100కు పెరిగాయి. కానీ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మౌలిక సదుపాయాలు ఇంకా గణనీయంగా అభివృద్ధి చెందలేదని” ఆయన అన్నారు.
ఆయన తన ప్రసంగంలో విద్యా వ్యవస్థలో ఏర్పడిన లోపాలను ఎత్తిచూపారు. పదేళ్లలో 6,000 ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయని, గత ఏడాది లోపలే 1,800 స్కూళ్లు మూతపడిన విషయం గమనార్హమని చెప్పారు. “అప్పుడు బంగారు తెలంగాణ అని చెప్పారు, ఇప్పుడు వజ్రాల తెలంగాణ అంటున్నారు. కానీ విద్యా రంగం మాత్రం దిగజారిపోతోంది. 1931 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేకుండా ఉన్నాయి. ఇన్ని వేల కోట్ల బడ్జెట్ పెట్టినా పరిస్థితి మారడం లేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రభుత్వ స్కూళ్లపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. స్కూళ్లలో ఒకటే బాత్రూం ఉంటుంది, అక్కడ పందులు తిరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఎలా ప్రభుత్వ స్కూళ్లలో చదవగలరు? తల్లిదండ్రులు అప్పు చేసి ప్రైవేట్ స్కూళ్లకు పంపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలి” అని పైడి రాకేశ్ రెడ్డి అన్నారు.
“విద్యాశాఖ సీఎం వద్ద ఉంది. కానీ సీఎం దగ్గర చాలా పనులు ఉంటాయి. కాబట్టి ఈ శాఖను మరొకరికి అప్పగిస్తే మంచిది. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మెరుగుపరిచే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేకపోతే డ్రాప్ ఔట్స్ సంఖ్య ఇంకా పెరుగుతుంది” అని ఎమ్మెల్యే సూచించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి సీనియర్ సభ్యుల సూచనలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, రిటైర్డ్ ఆఫీసర్ల సహాయంతో పాఠశాలల నిర్వహణను మెరుగుపర్చాలన్నారు రాకేశ్ రెడ్డి. స్కూళ్లకు కాంపౌండ్ వాల్, శుభ్రమైన వసతులు కల్పించాలని, బడ్జెట్ కేటాయింపులను స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలన్నారు.
Hyderabad: క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య.. మృతుడి చివరి ఫోన్ కాల్ లో ఏముందంటే?