ఆదొక జాతీయ రహదారి.. హైద్రాబాద్ టు ముంబాయి హైవేపై నిత్యం వేలాది వాహనాలు ఆ రోడ్డు మీద వెళ్తాయి. అలాంటి రోడ్డు పైకి ఇప్పుడు వాహనదారులు రావాలి అంటేనే ఒకటికి, రెండుసార్లు ఆలోచిస్తున్నారు. లింగంపల్లి టు సంగారెడ్డి 30 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డు పై ప్రయాణం చేయాల్సివస్తే అది నరకమే అని ఫీల్ అవుతున్నారు ప్రయాణికులు. సంగారెడ్డి జిల్లా పరిధిలో ముంబై 65వ నేషనల్ హైవే విస్తరణ పనులు ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. ఇక్కడ పనులు స్పీడ్ గానే జరుగుతున్నప్పటికీ, ప్రయాణికులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. ఈ జాతీయ రహదారి వెడల్పు పనుల నేపథ్యంలో లింగంపల్లి టు సంగారెడ్డి చేరుకోవాలంటే దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. ఈ రోడ్డుపై ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్ వల్ల కిలో మీటర్ల పొడవునా భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. సంగారెడ్డి టు లింగంపల్లి వరకు సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి 2 గంటల సమయం పడుతుంది.
దీని వల్ల ఈ రోడ్డు పై ప్రయాణం అంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. దీనికి తోడు అక్కడక్కడ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వాటిని నివారించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో సమస్య రోజు రోజుకు పెరిగిపోతోంది. రోడ్డు పనులు జరుగుతున్న చోట్ల హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు లేకపోవడంతో ఇరువైపులా తవ్విన గుంతల్లో అనుకోకుండా వాహనలు పడి పోవడంతో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో అధికారుల అలసత్వం అడుగు అడుగున కన్పిస్తుంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా మధ్యలో వచ్చే గ్రామాల వద్ద యూటర్న్ లు, చౌరస్తాల వద్ద రాత్రి వేళల్లో ఎక్కడో ఒకచోట నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ జాతీయ రహదారిని 6 లైన్ల రహదారిగా మారుస్తున్నారు. అందులో భాగంగా ఈ పనులు రెండేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉండడంతో, సంబంధిత అధికారులు రహదారి పై సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు అంటించి ముందస్తు జాగ్రత్తలు తీసుకంటే ఇన్ని ఇబ్బందులు ఉండవని అంటున్నారు వాహనదారులు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి లింగంపల్లి వరకు రూ.800 కోట్ల ఖర్చుతో 30 కిలోమీటర్ల మేర 6 లైన్ల పనులు జరుగుతున్నాయి. ప్రజాప్రయో జనాలు, వాహనదారుల సౌకర్యార్థం ఈ హైవేను 4 లైన్ల నుంచి 6 లైన్లుగా విస్తరించారు. ఈ 65వ నేషనల్ హైవే ముంబై టూ హైదరాబాద్, 161వ నేషనల్ హైవే నాందేడ్ అకోలా టూ సంగారెడ్డి వరకు ఉన్న రెండు హైవేలు ఈ ఆరు లైన్ల రహదారిలో కలుస్తాయి. ఇందుకోసం మామిడిపల్లి చౌరస్తా వద్ద లింక్ రోడ్డును ఇది వరకే నిర్మించారు. ఇక మధ్యలో గ్రామాలు, చౌరస్తాల వద్ద ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఈ రహదారి విస్తరణ పనులను పర్యవేక్షిస్తున్నారు. నేషనల్ హైవేకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించి రోడ్డు నిర్మాణ తవ్వకాలు చేపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో కొనసాగుతున్న 6 లైన్ల 65వ నేషనల్ హైవేలో మొత్తం 9 ఫ్లై ఓవర్ల్, అండర్ పాస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. సంగారెడ్డి చౌరస్తా, కంది, ఐఐటీహెచ్ పాయింట్, గణేశ్ గడ్డ, రుద్రారం, లక్షారం, ఇస్నాపూర్, నవోపాన్ కమాన్, లింగంపల్లి స్టేజీల వద్ద బ్రిడ్జిలు నిర్మిస్తారు. లింగంపల్లి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు పూర్తికావస్తుండడంతో అక్కడ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టనున్నారు. సంగారెడ్డి నుంచి లింగంపల్లి వరకు హై స్పీడ్ హైవే నిర్మిస్తుండడంతో రోడ్డు పక్కన ఉన్న భవనాలు, తాత్కాలిక షెడ్లు ఇతరత్రా దుకాణ సముదాయాలను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రోడ్డుకు ఇరువైపులా వరద నీరు, మురుగు నీరు వెళ్లేందుకు కాల్వల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ కొత్త రహదారిపై 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లేలా విస్తరణ పనులు సాగుతున్నాయి. అయితే ఈ పనులు అన్ని మంచివే అయిన అధికారులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తమకు ఇబ్బందులు తప్పుతాయి అని అంటున్నారు వాహనదారులు.
ఇవి కూడా చదవండి
రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ, ఈ పనుల వల్ల ట్రాఫిక్ చాలా ఎక్కువ ఏర్పడి 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దూరాన్ని దాదాపు మూడు గంటలు పడుతుందని, విస్తరణ పనులను వేగంగా చేయడం వల్ల నాణ్యత లోపించి, ఇప్పుడే రోడ్డు పక్కన తీసినటువంటి డ్రైనేజీ నిర్మాణాలు నాసిరకంగా ఉండి బీటలు వారుతున్నాయని వాటి వల్ల ప్రమాదాలు సైతం జరుగుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు. ఇక ఉదయం సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయని, ఆ సమయాలలో విస్తరణ పనులు చేయడంతో ఆ ప్రాంతమంతా దుమ్ము ధూళితో రోడ్డు మొత్తం నిండిపోతుంది అని.. దీనివల్ల ఇబ్బందులు పడుతున్నమని అంటున్నారు వాహనదారులు. దీనికితోడు విస్తరణ పనుల్లో భాగంగా కొన్ని చోట్ల జాతీయ రహదారి పెద్దగా ఏర్పడటంతో వేగంగా వస్తున్న వాహనాలు నియంత్రణను కోల్పోతున్నామని, ఇంకొన్ని గ్రామాలలో ఇంకా రోడ్డు విస్తరణ పనులు కాకపోవడంతో రోడ్డు చిన్నగా అవ్వడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు సంభవిస్తున్నాయని, గ్రామాల సమీపంలో కనీస సూచిక బోర్డులు కానీ ట్రాఫిక్ అధికారులుగానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని, సంబంధింత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.