Telangana: వైకల్యాన్ని జయించి.. ఐఐఐటీలో సీటు సాధించాడు.. కానీ

Written by RAJU

Published on:

అలహాబాద్: ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మానవ జన్మ లభించదు అంటారు. మరి అంతటి అరుదైన అవకాశం లభించి.. మనిషిగా పుట్టిన తర్వాత.. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. కష్టమైనా, సుఖమైనా ముందుకు సాగాలి. ప్రాణం పోవడం కన్నా పెద్ద సమస్య ఏది ఉండదు. అంత గొప్ప వరాన్ని చిన్న చిన్న కారణాలు, సమస్యలకు భయపడి.. వృథా చేసుకోవడం ఎంత వరకు సమంజసం. మరీ ముఖ్యంగా అభం శుభం తెలియని విద్యార్థులు కేవలం చదువు ఒత్తిడి భరించలేక.. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవాలనేంత దారుణం నిర్ణయం తీసుకొంటున్నారంటే.. ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. తాజాగా చదువుల ఒత్తిడికి మరో విద్యార్థి బలయ్యాడు. ఐఐఐటీలో సీటు సాధించాడు.. కానీ అంతలోనే దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలు..

తెలంగాణకు చెందిన దివ్యాంగ విద్యార్థి రాహుల్ మాదాల చైతన్య అలహాబాద్ ఐఐఐటీలో సీటు సంపాదించాడు. చదువు పూర్తి చేసుకుంటే మంచి ఉద్యోగంలో స్థిరపడతాడు.. ఇక అతడి గురించి ఎలాంటి భయం లేదని తల్లిదండ్రులు నిశ్చింతగా ఉన్నారు. అయితే వారి ఆశలను అడియాసలు చేస్తూ.. చైతన్య దారుణ నిర్ణయం తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం అనగా శనివారం నాడు.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ మరో విషాదకరమైన అంశం ఏంటంటే.. తెల్లరితే చైతన్య బర్త్‌డే. పుట్టినరోజుకు ముందే తనువు చాలించి.. కన్నవాళ్లకి తీరని కడుపుకోత మిగిల్చాడు. శనివారం రాత్రి 11.55 గంటలకు హాస్టల్ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన విద్యార్థులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే తీవ్రంగా గాయపడటంతో ప్రాణాలు విడిచాడు.

ఈ సంఘటన ప్రయాగ్‌రాజ్ జల్వాలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు మొదలు పెట్టారు. ఘటన జరిగిన స్థలంలో సూసైడ్ నోట్‌లాంటివి ఏం లభించలేదని తెలిపారు. అయితే తాజాగా జరిగిన పరీక్షల్లో చైతన్య ఫెయిల్ అయ్యాడని ఆ ఒత్తిడి కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం.. ఓ కమిటీ వేసి విచారణ చేపట్టి వారం రోజుల్లో నివేదిక అందజేస్తామని తెలిపింది.

చైతన్య తల్లి మాట్లాడుతూ.. “శనివారం రాత్రి నా కొడుకు కాల్ చేసి నాతో మాట్లాడాడు. కాస్త ముభావంగా ఉన్నాడు. పైగా తమ్ముడిని, తండ్రిని జాగ్రత్తగా చూసుకోమని నాకు చెప్పాడు. ఎప్పుడు లేనిది అలా వింతగా మాట్లాడటంతో నాకు భయం వేసింది. వెంటనే తనకు కాల్ చేశాను. కానీ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. భయపడుతూనే ఉన్నాను. తెల్లవారుతూనే నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిపారు” అంటూ కన్నీటిపర్యంతం ఉంది.

“నా కొడుకు బాగా చదువుతాడు. జేఈఈలో తనకు 52వ ర్యాంక్ వచ్చింది. అలాంటిది కాలేజీ వాళ్లు.. నా కొడుకు గత ఆరు నెలలగా క్లాసెస్‌కి రావడం లేదని అంటున్నారు. కానీ దాని గురించి మాకు ఎప్పుడు చెప్పలేదు. నా కొడుకుకు చదువు, టీవీ, ఫోన్ చూడటం మాత్రమే తెలుసు. తను బయట తిరగడం నేను ఎప్పుడు చూడలేదు. గత కొన్నాళ్లుగా నా కొడుకు సరిగా మాట్లాడలేకపోతున్నాడు. అందుకే తనకు స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నాం. తనకు సంబంధించిన ప్రతి విషయం నాతో చెప్పేవాడు. చదువు గురించి ఇబ్బంది పడుతున్నట్లు నాకు ఎప్పుడు చెప్పలేదు” అని చెప్పుకొచ్చింది. ఇక చైతన్య తండ్రి టిఫిన్ సెంటర్ నడుపుతూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాహుల్ ఆత్మహత్య నేపథ్యంలో కాలేజీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

ఇవి కూడా చదవండి:

పురుషులకు 59 మహిళలకు 41

బియ్యం ఖర్చంతా కేంద్రానిదే

Subscribe for notification
Verified by MonsterInsights