మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వ్యవసాయ సాగు విస్తరణలో పంట తెగుళ్లను నిర్మూలించే పద్ధతిలో మహిళా విభాగం ముందుకెళ్తుంది. డ్రోన్ల సహాయంతో పిచికారి చేస్తూ సేద్యానికి మహిళా మణులు వెన్నుదన్నుగా నిలిచే సమయం రానే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకం.. నమో డ్రోన్ దీదీ. ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలో అమలు కావడంతో విద్యావంతులైన డ్వాక్రా గ్రూప్ మహిళలు డ్రోన్లతో పిచికారి చేసే శిక్షణ పొందుతూ సబ్సిడీల రూపంలో జీవన ఉపాధి పొందుతున్నారు…రైతులకు డ్వాక్రా మహిళలు అండగా నిలవనున్నారు. వ్యవసాయ పనుల్లో వారికి సాయంగా నిలిచి డ్రోన్ల సాయంతో పురుగు మందులు, ఎరువులు పిచికారి చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నమో డ్రోన్ దీదీ పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలను వ్యవసాయ రంగంలో కూడా తీసుకొచ్చి వారికి జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలో ఈ పథకాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రారంభించారు. ఈ పథకంతో విద్యావంతులైన మహిళలకు సబ్సిడీపై డ్రోన్లు అందించనున్నారు. వీటి నిర్వహణపై తొమ్మిది రోజులపాటు శిక్షణ ఇచ్చి వ్యవసాయ పనులు చేయిస్తారు. తొలి విడతగా జిల్లాలో ప్రతి మండలంలోని మూడు డ్వాక్రా గ్రూప్‌లలోని విద్యావంతుల్ని ఎంపిక చేస్తారు. వ్యవసాయ దిగుబడి వ్యయాన్ని తగ్గించడం, కూలీల సమస్యల అధిగమించడం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మహిళలకు మారుతున్న టెక్నాలజికి అనుగుణంగా అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలన్న లక్ష్యంతో మహిళలకు ఈ బాధ్యతల్ని అప్పగిస్తున్నారు. దానికి అనుగుణంగా అధికారులు విద్యావంతులైన మహిళల్ని ఎంపిక చేసిన వారందరికీ శిక్షణ అందిస్తున్నారు.
వ్యవసాయ రంగానికి ఉత్పత్తి వ్యయం పెరగడంతో రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఎక్కువ ఖర్చు కూలీలు, ఎరువులు, మందులకే సరిపోతుంది. వీటితో పాటు కొన్ని సమయాల్లో పొలాల్లో మందులు పిచికారి చేసేందుకు కూలీలు సైతం చిక్కడం లేదని రైతులే పిచికారి చేసుకుని అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇటీవల వ్యవసాయ రంగంలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం డ్రోన్లను తయారు చేసి వాటిని రైతులకు అందించి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని భావించింది. దానికి అనుగుణంగా నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశ పెట్టిన కూటమి ప్రభుత్వం బయట వ్యక్తులకు కాకుండా మహిళల్ని వ్యవసాయ రంగానికి తీసుకొచ్చి వారికి జీవనోపాధి అవకాశాలు పెంచాలని భావించి ఈ బాధ్యతల్ని డ్వాక్రా మహిళలకు అప్పగిస్తే సమర్ధవంతంగా నిర్వహిస్తారని ప్రభుత్వం ఆలోచించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక మహిళలకు అందించే డ్రోన్ల ఖరీదు రూ.10లక్షలు విలువ చేస్తుంది.. వీటిలో మహిళలు కేవలం 20శాతం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 80శాతం ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తుందని అంటే రూ. పది లక్షల్లో మహిళలు రెండు లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన రూ.8లక్షలు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని దాన్ని తిరిగి చెల్లించనవసరం లేదు అన్నారు. ఇక వీటిని ఎలా ఆపరేట్ చేయాలన్న దానిపై మహిళలకు ఆందోల్ జోగిపేట పట్టణంలోని మహిళా సమైక్యా భవనంలో 9 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వీరికి డ్రోన్లు ఏ విధంగా అమర్చాలి వాటిలో వచ్చే చిన్న చిన్న సాంకేతిక సమస్యలపై అవగాహన కల్పిస్తారు. ఇక రసాయనాలు, పురుగు మందుల్ని ఏ విధంగా కలిసి డ్రోన్లకు అమర్చాలి, వాటిని రిమోట్ కంట్రోల్ ద్వారా ఏ విధంగా ఆపరేట్‌పై తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..