హన్మకొండ జిల్లా కమలాపురం మండల కేంద్రంలో తాహిర్ అనే వ్యక్తి పాత ఇనుప సామాన్ల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే తాహిర్ సోమవారం ఉదయం దుకాణం ఓపెన్ చేసి సామాన్లు సర్దుకుంటున్నాడు. ఇంతలో అతనికి వింత శబ్దాలు వినిపించడంతో అక్కడి వాతావరణం కాస్త తేడాగా అనిపించింది అతనికి. అయినా తన పని తాను చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతని దుకాణంలో ఉన్న పాత ఇనుప బీరువా దగ్గర ఏదో కదులుతున్నట్టు అతనికి అనిపించింది. ఏమై ఉంటుందా అని పరిశీలించిన అతనికి గుండె ఆగినంత పనైంది. ఒక్క ఉదుటన అక్కడినుంచి బయటకు వచ్చి పడ్డాడు. బీరువాలో తాహిర్‌కి ఓ పెద్ద కొండచిలువ కనిపించింది.
దానిని చూసిన దుకాణంలోని సిబ్బంది కూడా భయంతో బయటకు పరుగులు తీసి, చుట్టుపక్కలవారిని కేకలు వేశారు. కేకలు విని అక్కడికి చేరుకున్న స్థానికులు కొండచిలువను చూసి కంగారు పడ్డారు. కొందరు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దాంతో ఘటనాస్థలికి చేరుకున్న అటవీ సిబ్బంది కొండచిలువను బంధించారు. దానిని సురక్షితంగా తీసుకెళ్ళి సమీపంలోని అటవీప్రాంతంలో వదలిపెట్టారు. దీంతో స్థానికులు, షాప్ సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.