ఆరుగాలం కష్టించి పండించిన పంటను కాపాడుకోవడం, అమ్ముకోవడం అన్నదాతలకు కష్టంగా మారింది. నల్గొండ జిల్లా హాలియా మండలం ఇబ్రహీంపేట స్టేజీ వద్ద ప్రధాన రోడ్డు వెంట రైతులు ధాన్యాన్ని ఎండబెట్టారు. అకాల వర్షానికి ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు రైతులు పట్టాలు కప్పుతున్నారు. అకాల వర్షం, ఈదురు గాలులకు ధాన్యపు రాశులపై కప్పిన పట్టాలు లేచిపోయాయి. ఇదే సమయంలో నిడమనూరు మండలం బొక్క ముంతలపాడులో విధులు ముగించుకొని ఇబ్రహీంపట్నం స్టేజి మీదుగా నల్లగొండకు ప్రత్యేక పోలీసు దళం వెళ్తోంది. వర్షానికి తమ ధాన్యం కాపాడుకునేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులను పోలీసులు గమనించారు. వెంటనే పోలీసులు పెద్ద మనసు చేసుకొని రైతులకు సహాయంగా రంగంలోకి దిగారు. ధాన్యపు రాశులపై పట్టాలు కప్పడం, కుప్ప చేయడం లాంటివి చేశారు. ధాన్యం తడవకుండా కాపాడిన పోలీసులకు రైతులు చేతులెత్తి దండం పెట్టి ధన్యవాదాలు తెలిపారు.
పోలీసులు దేశ సేవ చేయడమే కాదు.. రైతుల బాధలు తీర్చారంటూ స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైతు కుటుంబాలను నుంచి వచ్చిన తమకు రైతుల కష్టాలు తెలుసని పోలీసులు చెబుతున్నారు. అందుకే పెద్ద మనసు చేసుకొని రైతులకు సహాయం చేశామని అంటున్నారు. ఈ ఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జై జవాన్.. జై కిసాన్ అంటూ సోషల్ మీడియాలో వారిని పలువురు అభినందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…