ఇంటా బయటా పెట్టుబడుల వేట సాగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అటు సీఎం జపాన్ టూర్‌ను అనౌన్స్ చేశారో లేదో… ఇటు హైదరాబాద్‌లో జరిగిన బిజినెస్ కాంక్లేవ్‌లో పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరి దగ్గరకైనా వెళ్తా.. ఎన్ని పర్యటనలైనా చేస్తానంటున్న సీఎం రేవంత్ రెడ్డి… మరో టూర్ ఫిక్స్ చేసుకున్నారు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి జపాన్‌లో పర్యటించబోతున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా 6 రోజుల పాటు జపాన్‌లో పర్యటిస్తారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఏఐ ఆధారిత అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు.
అలాగే జపాన్‌లో తొలిసారిగా నిర్వహించబోయే ఒసాకా ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో పాల్గొంటారు రేవంత్‌రెడ్డి. ఈ ఎక్స్ పోలో భారత ప్రభుత్వానికి కేటాయించిన పెవిలియన్‌లో తెలంగాణ ప్రభుత్వ స్టాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. టైమ్ స్లాట్ ప్రకారం తెలంగాణకు రెండ్రోజులపాటు అవకాశం ఉంటుంది. ఆ రెండ్రోజులు పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తారు. పలు ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం ఉంది. జపాన్ పర్యటనకు సీఎం రేవంత్‌తో పాటు మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు ప్రభుత్వ అధికారులు వెళ్లనున్నారు.
ఇటు హైదరాబాద్‌లో జరిగిన ఇండియా-లాటిన్ అమెరికా-కరీబియన్ కంట్రీస్ బిజినెస్ కాంక్లేవ్‌లో పలు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. పెట్టుబడులను ఆకర్షించేలా MSME పాలసీ ఉండటంతో… 6 సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయన్నారు ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు. పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం. రానున్న ఆరు నెలలు పెట్టుబడులే పెట్టుబడులంటోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..