Telangana: నిత్యం తల్లిదండ్రులకు నరకం.. పశ్చాతాపంతో ఓ కొడుకు ఏం చేశాడంటే..? – Telugu News | Son bows at parents’ feet at police station in suryapet district

Written by RAJU

Published on:

అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదనే నానుడి నిజమవుతోంది. నవ మాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆసరాగా ఉండాల్సిన కొందరు కొడుకులు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులను అవమానించిన ఓ కొడుకు మాత్రం.. పశ్చాత్తాపంతో ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన పిల్లలు ఆస్తుల వివాదంతో కన్నవారిని దూరం చేసుకుంటున్నారు. మరికొందరు మద్యం మత్తులో కర్కశంగా వ్యవహరిస్తున్నారు. సూర్యాపేట జిల్లా పెనపహాడ్‌ మండలం భక్తాళాపురం గ్రామానికి చెందిన నెమ్మాది సోమయ్య, పిచ్చమ్మలు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదుగురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. కూలీనాలీ చేసి ఐదుగురు కుమార్తెల పెళ్లిళ్లు చేశారు ఈ దంపతులు. వీరితోపాటు కొడుకు లింగయ్య కూడా కూలిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తరచూ మద్యం తాగుతుండటంతో ఐదేళ్ల క్రితం లింగయ్యను.. వదిలి భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో లింగయ్య పూర్తిగా మద్యానికి బానిస అయ్యాడు. మద్యం మత్తులో ఇంటికి వచ్చి వృద్ధులైన తల్లిదండ్రులను వేధించేవాడు.

కొడుకు లింగయ్య వేధింపులు ఎక్కువ కావడంతో తల్లిదండ్రులు సోమయ్య, పిచ్చమ్మలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పెన్‌పహాడ్ ఎస్ఐ గోపికృష్ణ.. లింగయ్యను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చాడు. పశ్చాత్తాపం చెందిన కొడుకు లింగయ్య.. ఇక నుండి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టబోనంటూ పోలీస్ స్టేషన్ ఆవరణలో వారి పాదాలకు నమస్కరించాడు. తల్లిదండ్రులతో మర్యాదగా నడుచుకుంటానని, సత్ప్రవర్తననతో మెలుగుతానని లింగయ్య చెప్పాడు. దీంతో మరోసారి ఇలా తల్లిదండ్రులను వేధిస్తే శిక్షిస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చి పంపించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Subscribe for notification