మండే ఎండల్లో తెలంగాణకు కూల్ న్యూస్ వచ్చింది. అవును రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమ, మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని IMD అంచనా వేసింది. ప్రధానంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ప్రస్తుతం దక్షిణ బంగాళా ఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఇది రాగల 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశలోను, ఆ తరువాత ఉత్తర దిశగా కదిలి, రాగల 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ఎఫెక్ట్‌తో తెలంగాణలో మంగళవారం, బుధవారం ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో ఓ మోస్తారు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుండి 40 కి మీ వేగంతో ఈదురు గాలులు వీచే చాన్స్ కూడా ఉందని వెల్లడించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.