తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు మరింత ఊతమిచ్చేలా మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో నాలుగు కొత్త మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం రూ.3,225 కోట్ల పెట్టుబడులతో వస్తున్న ఈ పరిశ్రమలు, రాష్ట్ర పరిశ్రమల రంగానికి మరింత ప్రాధాన్యతను తీసుకురానున్నాయి. ఈ నాలుగు ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైనది అమరరాజా గిగా ఫ్యాక్టరీ మూడో దశ నిర్మాణం. రూ.1,900 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ యూనిట్, 262 ఎకరాల విస్తీర్ణంలో నెలకొననుంది. తొలి దశలో రూ.1,200 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ గిగా ఫ్యాక్టరీ, 2026 డిసెంబర్ నాటికి 3 గిగావాట్ల సామర్థ్యాన్ని చేరుకోనుంది. ఈ ప్లాంట్‌లో తయారయ్యే వాల్వ్ రెగ్యులేటెడ్ లీడ్ యాసిడ్ బ్యాటరీలు ఫోర్డ్, హోండా, హ్యుందాయ్, మహీంద్రా, మారుతి, టాటా మోటార్స్ తదితర దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీలకు సరఫరా కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 4,500 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
అల్టిమిన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.800 కోట్ల పెట్టుబడితో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (LFP) టెక్నాలజీ ఆధారిత బ్యాటరీలు మరియు ఇతర కీలక పదార్థాలను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్లాంట్ దివిటిపల్లిలో 20 ఎకరాల విస్తీర్ణంలో రెండు దశల్లో నిర్మాణం పూర్తి చేయనుంది. మొత్తం మూడు సంవత్సరాల్లో పూర్తి కాబోయే ఈ ప్రాజెక్ట్ ద్వారా 300 మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
ఇక లోహమ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.502 కోట్ల పెట్టుబడితో వ్యర్థాల ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఇది 20 ఎకరాల విస్తీర్ణంలో రెండు దశల్లో విస్తరించనుంది. ఏడాదికి 1.50 లక్షల టన్నుల మెటీరియల్ హ్యాండ్లింగ్ సామర్థ్యంతో పనిచేసే ఈ పరిశ్రమ ద్వారా 414 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.23 కోట్ల పెట్టుబడితో లిథియం అయాన్ సెల్ల కోసం స్టీల్ క్యాన్లు, క్యాప్ల తయారీ చేయనుంది. దివిటిపల్లిలో 6 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ పరిశ్రమ ద్వారా 150 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా తెలంగాణను బ్యాటరీ ఉత్పత్తి కేంద్రంగా మారుస్తూ, పరిశ్రమల అభివృద్ధికి మరింత ఊతమిచ్చే అవకాశముంది. పరిశ్రమల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతుతో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే దిశగా ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..