తెలంగాణవ్యాప్తంగా ఎండలు మండి పోతున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న భానుడి భగభగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో నుంచి భయటకి రావాలంటేనే భయపడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాకు అలర్ట్ జారీ చేస్తోంది. ఇక గురువారం రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలతో పోలీస్తే ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయినట్టు తెలుస్తోంది. దీంతో ఆదిలాబాద్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆదిలాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయినట్టు తెలుస్తోంది.
ఇక అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఆదిలాబాద్ జిల్లా మినహా మిగతా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గాలిలో తగ్గుతున్న తేమ, వేడి గాలులు వలన ఉక్కపోతతో పాటు, రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలలో మార్పులు పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు.
ఇదిలా ఉండగా గత రెండ్రోజుల్లో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఒక్క సారిగా వాతావరణం మారిపోయింది. నగరవాసులపై ఉదయం నుంచి భానుడు తన విశ్వరూపాన్ని చూపించగా.. సాయంత్రం చల్లని వాతావరణంతో వరుణుడు వారికి ఉపసమనం కల్పించాడు. హైదరాబాద్ సహా కొన్ని జిల్లాల్లో బుధవారం నుంచి గురువారం మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇక రాబోయే వారం రోజుల్లో కూడా రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…!