Telangana: జేఎన్టీయూహెచ్‌లో దూరవిద్య మరింత దూరం! ఆసక్తి చూపని..!

Written by RAJU

Published on:

కోర్సుల పూర్తికి ఆసక్తి చూపని అధికారులు

ఆశావహుల ఎదురుచూపు

విభాగాల మధ్య సమన్వయ లోపం

హైదరాబాద్‌ సిటీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక విద్యకు కేరాఫ్‌గా నిలిచిన జేఎన్టీయూహెచ్‌ (JNTUH)లో దూరవిద్య మరింత దూరమవుతోంది. విశ్వవిద్యాలయంలోని కొన్ని విభాగాల మధ్య సమన్వయం కొరవడడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దూరవిద్యా విధానం (Distance education system) లో వర్సిటీ ప్రవేశపెట్టిన పలు కోర్సులను నిర్ణీత గడువులో పూర్తి చేసేలా ఉన్నతాధికారులు శ్రద్ధ కనబరచడం లేదు. ఫలితంగా జేఎన్టీయూ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మంచి ఉద్యోగాలు పొందుదామనుకున్న ఆశావహులకు, వివిధ కంపెనీల్లో పనిచేస్తూ పదోన్నతులు పొందేందుకు ఉద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

పారిశ్రామిక అవసరాలు తీరేదెలా..!

పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డిప్లమో హోల్డర్లు, ఇంజనీరింగ్‌, సైన్స్‌, ఫార్మసీ గ్రాడ్యుయేట్ల పరిజ్ఞానాన్ని పెంపొందించే ఉద్దేశంతో జేఎన్టీయూహెచ్‌ స్కూల్‌ ఆఫ్‌ కంటిన్యూయింగ్‌ అండ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ (ఎస్‌సీడీఈ) విభాగం పలు షార్ట్‌టర్మ్‌, లాంగ్‌టర్మ్‌ సర్టిఫికెట్‌ కోర్సులను ప్రవేశపెట్టింది. గతేడాది నవంబర్‌ 25న ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ఇండస్ట్రియల్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌, ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ టెక్నిక్స్‌ కోర్సులను ఆఫర్‌ చేసింది. ఆరు నెలల కోర్సులో రెండు నెలల తరగతులు, 4 నెలల ప్రాజెక్ట్‌ వర్క్‌ చేయాల్సి ఉంది. కోర్సులకు అర్హత కలిగిన సుమారు 200 మంది అభ్యర్థులు గడువు (డిసెంబర్‌ 17) లోగా దరఖాస్తు చేసుకున్నా రు. దరఖాస్తు గడువు ముగిసి మూడు నెలలవుతున్నా ఇంతవరకు తరగతులు మొదలు కాలేదు. ఫలితంగా పారిశ్రామిక అవసరాలను తీర్చాలనే ఉద్దేశం నీరుగారుతోంది.

డైరెక్టరేట్ల మధ్య కొరవడిన సమన్వయం

జేఎన్టీయూలోని అడ్మిషన్‌ డైరెక్టరేట్‌, దూరవిద్య డైరెక్టరేట్‌ మధ్య సమన్వయం కొరవడడమే తరగతుల ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. ఆయా కోర్సులకు అర్హులైన అభ్యర్థుల జాబితా అడ్మిషన్‌ విభాగం నుంచి తమకు అందలేదని ఎస్‌సీడీఈ అధికారులు చెబుతుండగా, యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ అప్రూవల్‌ కోసం పంపిన ఫైలు ఇంకా వెనక్కి రాలేదని అడ్మిషన్‌ విభాగం అధికారులు చెబుతున్నారు. రెండు విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం, దూరవిద్య కోర్సుల గురించి ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో తరగతులు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోందని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వాపోతున్నారు.

Updated Date – 2023-03-13T14:33:22+05:30 IST

Subscribe for notification