Telangana: ఛేజ్‌ చేసి చంపుతున్నారు.. స్కెచ్చేసి లేపేస్తున్నారు.. ఎందుకిలా..? – Telugu Information | Crime Tradition Elevated in Telangana State Test Particulars

Written by RAJU

Published on:

తరాలుగా కక్షలూ కార్పణ్యాల్యేమీ లేవు. దాయాదుల గొడవలు కాదు. కారణం చిన్నదే కావచ్చు..కానీ మర్డర్‌ మాత్రం ఫ్యాక్షన్‌ రేంజ్‌లో ఉంటోంది. ఈమధ్య కొన్ని హత్యలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో టూవీలర్‌పై వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టి.. గొడ్డళ్లతో నరికిచంపారు ప్రత్యర్థులు.

రౌడీగ్యాంగ్‌ల గొడవేం కాదు. ఎక్కడో మాటామాటా తేడావచ్చింది. ఓ దెబ్బకొట్టుకునేదాకా వెళ్లింది. ఇంకేముందీ పంతం పగబట్టింది. మర్డర్‌కి స్కెచ్చేసింది. రెక్కీవేసి మరీ అర్ధరాత్రి వేళ నడిరోడ్డుపై మట్టుబెట్టేసింది. మరొకరితో కలిసి బైక్‌పైవెళ్తున్న 32ఏళ్ల బొడ్డు మహేష్‌ని ఎల్బీనగర్‌ శివగంగ కాలనీలో కొందరు దుండగులు వెంటాడి హతమార్చారు. కారుతో ఢీకొట్టగానే ఇద్దరూ కిందపడ్డారు. రెండోవ్యక్తి వెంటనే అక్కడినుంచి తప్పించుకోగా మహేష్‌ని వెంటాడి చంపేశారు.

దాదాపుగా రెండేళ్లక్రితం తట్టి అన్నారం బార్‌లో జరిగిన చిన్న గొడవ ఈ హత్యకు దారితీసిందంటున్నారు. పురుషోత్తం బీర్‌ బాటిల్‌తో మహేష్‌పై దాడిచేశాడని, తర్వాత మహేష్‌ తన అనుచరులతో పురుషోత్తంపై దాడిచేశాడని ఆ ఘటనే ఈ హత్యకు దారితీసిందని అనుమానిస్తున్నారు. ఓ క్లినిక్ లో ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసిన కేసులో జైలుకెళ్లాడు మహేష్‌. ఈమధ్య బెయిల్‌పై రిలీజ్‌ అయ్యాడు.

బొడ్డు మహేష్‌ హత్య వెనుక కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిలకా ఉపేందర్ రెడ్డి హస్తముందని ఆరోపిస్తున్నారు హతుడి బంధువులు. ఆరేడుమంది ఈ హత్యలో పాల్గొన్నారని ఆరోపిస్తున్నారు. పురుషోత్తం బావతో కలిసి ఉపేందర్‌రెడ్డి ఈ హత్యకు స్కెచ్‌ వేశారని ఆరోపిస్తున్నారు మహేష్‌ బంధువులు. నలుగురు నిందితులు పోలీసులకు లొంగిపోయినట్లు చెబుతున్నారు.

మహేష్‌ హత్య కేవలం చిన్న వివాదాల కారణంగానే జరిగిందా, అంతకుమించి మరేదన్నా కారణం ఉందా అనేది పోలీసు ఎంక్వయిరీలో తేలబోతోంది. ఎల్బీనగర్‌ మర్డరే కాదు.. కొన్నేళ్లుగా తెలంగాణలో ఫ్యాక్షన్‌ తరహా హత్యలు జరుగుతున్నాయి. మంథని ప్రాంతంలో లాయర్‌ దంపతులు, ఖమ్మం జిల్లాలో తమ్మినేని కృష్ణయ్య కొన్నేళ్లక్రితం పట్టపగలు ఇలాగే హత్యకు గురయ్యారు. ఈమధ్యే జగిత్యాలలో జీవన్‌రెడ్డి అనుచరుడిని పగటిపూటే కారుతో ఢీకొట్టి కత్తులతో పొడిచి హతమార్చారు.

వివాహేతర సంబంధంతో భార్య వేసిన మర్డర్‌ స్కెచ్‌కి వరంగల్‌ డాక్టర్‌ కూడా ఇలాగే బలయ్యారు. నడిరోడ్డుపై కారుని అటకాయించి మరీ డాక్టర్‌ని పొట్టనపెట్టుకున్నారు నిందితులు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఓ సామాజిక కార్యకర్తను కూడా పక్కా ప్లాన్‌తో కత్తులు, గొడ్డళ్లతో దాడిచేసి అందరిముందే చంపేశారు. దాసారంబస్తీలో యువకుడి హత్యకు ప్రతీకారంగా ప్రగతినగర్‌ ఏరియాలో జరిగిన మర్డర్‌ కొన్నాళ్లక్రితం గ్యాంగ్‌వార్‌ని మరిపించింది. ఓల్డ్‌సిటీలోనైతే చిన్నచిన్న కారణాలతోనే రక్తం కళ్లజూస్తున్నారు. నిలువునా ప్రాణాలు తీస్తున్నారు.

గోటితో పోయేదాన్ని కూడా గొడ్డలిదాకా తెస్తున్నారు. రాజీపడే అవకాశమున్న వివాదాలకు కూడా కత్తులు బయటికి తీస్తున్నారు. రోజుల తరబడి రెక్కీ చేస్తూ, అదనుచూసి వెంటాడి వేటాడుతున్నారు. కర్కశంగా హతమారుస్తూ ఫ్యాక్షన్‌ పగలను గుర్తుచేస్తున్నారు. ఇలాంటివాటిని కట్టడి చేయకపోతే వేటకొడవళ్ల వీరంగానికి అడ్డూఅదుపు ఉండదు.

Subscribe for notification