వల వేసినప్పడు దండిగా..మంచి చేపలు పడాలని జాలర్లు కోరుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు బ్యాడ్ లక్.. డెవిల్ ఫిష్ వంటివి వలలో చిక్కుతూ ఉంటాయి. మరొకొన్నిసార్లు షాక్‌కు గురిచేసేలా కొండచిలువలు, మొసళ్లు వలలో పడుతూ ఉంటాయి. ఎంతో ఆశతో వలను లాగిన జాలర్లు వాటిని చూసి కంగుతింటూ ఉంటారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో తరచుగా జరుగుతూనే ఉంటాయి. అయితే వలలో బైక్ చిక్కిడం మీరెప్పుడైనా చూశారా..? అలాంటి ఘటనే జరిగిందండోయ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట సమీపంలో చేపలు పట్టేందుకు వెళ్లిన వారికి అలాంటి విచిత్ర అనుభవమే ఎదురయింది.
స్థానిక యువకులు కొందరు ఆదివారం.. మాంచి చేపలు పులుసు తినాలని భావించారు. బయటకు కేజీ 200 నుంచి 500 వరకు అమ్ముతున్నారు. అంత ఖర్చు ఎందుకు… స్థానిక వాగుకు వెళ్లి వల వేద్దాం అనుకున్నారు. అనుకున్నదే తడవుగా… స్థానిక ఓటి చెరువుకి వచ్చి వాగులో చేపలు కోసం వల వేయగా ఓ ద్విచక్ర వాహనం చిక్కింది. వాగు మధ్యలో దొరికిన బైకును వారు ఒడ్డుకు తీసుకువచ్చారు. TS04EE3722 గల హీరో గ్లామర్ బైక్‌ని చూసి వారు షాకయ్యారు. ఈ- చలాన్ యాప్ లో నంబర్‌తో చెక్ చేయగా.. ఆ బైక్ పేరం రవీంద్ర రెడ్డి అని ఉంది. ఈ బైకు వాగు మధ్యలోకి ఎలా వచ్చి చేరిందని.. ఎవరైనా గల్లంతయ్యారా..? లేదా ఎవరైనా తీసుకువచ్చి చెరువులో పడేశారా అని స్థానికంగా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..