ఇటీవల కొమురవెల్లి, బల్కంపేట, బాసర ఆలయాల్లో జరిగిన టికెట్ల దందా వెలుగులోకి రావడంతో తెలంగాణలోని ఆలయాల్లో అన్ని రకాల టికెట్లను ఇకపై ఆన్లైన్‌లోనే అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. మాన్యువల్ టికెట్లను మళ్లీ మళ్లీ ఉపయోగించడం, నకిలీ టికెట్ల వాడకం వంటి అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ అయింది.
ఈ నెల 15 న మంత్రి సమీక్షా –
ఈ విషయంపై ఈ నెల 15న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎండోమెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ సమీక్ష తర్వాతే ఆన్లైన్ టికెట్ల వ్యవస్థపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా భక్తులకు పారదర్శక సేవల్ని అందించడంతోపాటు ఆలయ ఆదాయ-ఖర్చులపై పర్యవేక్షణ మరింత గట్టి చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, టికెట్ల బుకింగ్ కోసం భక్తులు ఆలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ముందే ఆన్లైన్‌లో సేవల్ని పొందే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం వేములవాడ, భద్రాచలం, యాదగిరిగుట్ట, బాసర, భద్రకాళి, చెర్వుగట్టు, కొమురవెల్లి తదితర ముఖ్య దేవాలయాల్లో టికెట్ల విక్రయాల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా వీఐపీ టికెట్ల అమ్మకాలపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. రోజూ 200 నుంచి 500 టికెట్ల వరకు భక్తులకు అక్రమంగా విక్రయిస్తున్నట్టు సమాచారం. సాధారణంగా రూ.500 టికెట్‌ను రూ.2,000 నుంచి రూ.5,000 వరకూ అమ్ముతూ కొందరు సిబ్బంది, మధ్యవర్తులు డబ్బు దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇంతేకాదు, టికెట్ కౌంటర్లలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు నకిలీ టికెట్లు ముద్రించి వాటిని విక్రయిస్తున్న వైనం గతంలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో బయటపడింది. ఒక్క రోజులోనే రూ.31,000 వరకు నకిలీ టికెట్ల ద్వారా వసూలు చేసిన ఘటన జరగగా, అనంతరం తీవ్ర విమర్శలు రావడంతో ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఇదే తరహాలో చెర్వుగట్టు దేవాలయంలోనూ టికెట్ల రీసైక్లింగ్, పార్కింగ్ ఫీజుల దందా వెలుగుచూసింది. బాసర ఆలయంలో లడ్డూ టికెట్లపై జరిగిన అక్రమాల నేపథ్యంలో ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్ కాగా, నలుగురు రోజువారీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు.
ఈ మొత్తం వ్యవస్థలో వీఐపీ టికెట్ల కేటాయింపుపైనా సీరియస్ ఆవశ్యకత నెలకొంది. ఎక్కువమంది భక్తులు క్యూలైన్‌లో నిలబడలేక వీఐపీ టికెట్ల కోసం ప్రయత్నిస్తుండగా, కొంతమంది ఈ అవకాశాన్ని డబ్బుగా మలుచుకుంటున్నారు. అధికారులు, సిబ్బంది ఏండ్ల తరబడి ఒకే ఆలయంలో విధులు నిర్వర్తిస్తూ, తమకు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని భక్తులలో అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..