TCS: మూడు కొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టిన టీసీఎస్

Written by RAJU

Published on:

న్యూఢిల్లీ: భారతదేశ డిజిటల్ పరివర్తనను మరింత వేగవంతం చేసేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఢిల్లీలో నిర్వహించిన “ఆక్సిలరేటింగ్ ఇండియా” కార్యక్రమంలో మూడు కొత్త సాంకేతిక సేవలను ఆవిష్కరించింది. ఈ సేవలు భారతదేశ అవసరాలకు అనుగుణంగా రూపొందించామని సంస్థ తెలిపింది. డేటా సార్వభౌమత్వం, భద్రత, కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ఆవిష్కరణలను ఈ సాంకేతికత ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమంలో టీసీఎస్ సీఈవో కె. కృతివాసన్, ప్రెసిడెంట్ (గ్రోత్ మార్కెట్స్) గిరీష్ రామచంద్రన్, ఇతర ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుంచి ప్రముఖ క్లయింట్లు పాల్గొన్నారు.

టీసీఎస్ సావరిన్‌సెక్యూర్ క్లౌడ్: దేశం కోసం ప్రత్యేకంగా రూపొందిన ఈ స్వదేశీ క్లౌడ్ సేవ, ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్ కోసం అధునాతన ఏఐ సామర్థ్యాలను అందిస్తుంది. ముంబై, హైదరాబాద్‌లోని టీసీఎస్ డేటా సెంటర్ల నుంచి నిర్వహించబడే ఈ క్లౌడ్, 2023 డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టానికి అనుగుణంగా డేటాను దేశంలోనే ఉంచుతుంది. జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్‌తో నిర్మితమై, 2030 నాటికి నెట్-జీరో కార్బన్ లక్ష్యాన్ని సాధించేలా రూపొందించారు. తక్కువ జాప్యంతో కీలకమైన అప్లికేషన్లను అందించడంతో పాటు, ఏఐ ఆధారిత డేటా విశ్లేషణలు, నిరంతర భద్రతా పరీక్షల ద్వారా పౌర సేవలను మెరుగుపరుస్తుంది.

టీసీఎస్ డిజిబోల్ట్: ఈ ఏఐ ఆధారిత లో-కోడ్ ప్లాట్‌ఫామ్, డిజిటల్ ప్రక్రియలను స్వయంచాలితం చేస్తూ, సంస్థలు తమ డిజిటల్ ఆవిష్కరణలను వేగంగా అమలు చేయడానికి సహాయపడుతుంది. ఓపెన్-సోర్స్ టెక్నాలజీలపై నిర్మితమైన ఈ ప్లాట్‌ఫామ్, ఏఐ ఆధారిత అప్లికేషన్లను స్కేల్ చేయడంలో, సంక్లిష్ట ఐటీ వ్యవస్థలను ఏకీకృతం చేయడంలో సంస్థలకు పోటీతత్వాన్ని అందిస్తుంది. టీసీఎస్ సైబర్ డిఫెన్స్ సూట్: ఈ ఏఐ ఆధారిత సైబర్‌సెక్యూరిటీ సేవ, హైబ్రిడ్ మల్టీ-క్లౌడ్, ఐటీ, ఆపరేషనల్ టెక్నాలజీ (ఓటీ) వాతావరణాల్లో భారత సంస్థలకు బలమైన రక్షణను అందిస్తుంది. సైబర్ బెదిరింపులను ముందస్తుగా గుర్తించి, ఆటోమేటెడ్ రెస్పాన్స్‌తో స్పందిస్తూ, 16,000 మంది సైబర్‌సెక్యూరిటీ నిపుణులతో భారతదేశ సైబర్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈ అంశంపై గిరీష్ రామచంద్రన్ మాట్లాడుతూ… “డేటా సార్వభౌమత్వం, ఏఐ, డిజిటల్ వేగం కలిసి దేశంలో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఈ సేవలు భారత అవసరాలకు అనుగుణంగా రూపొందించాం. దేశ ఆస్తుల రక్షణతో పాటు ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తాయి” అని పేర్కొన్నారు.

ఐపీవోకు అథర్ ఎనర్జీ

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అథర్ ఎనర్జీ లిమిటెడ్, రూ.2,626 కోట్లతో ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో BSE మరియు NSEలో జాబితా చేసే ప్రముఖ IPOలలో ఇది తొలిస్థానంలో నిలవనుంది. కంపెనీ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP) పత్రాల ప్రకారం, అథర్ ఎనర్జీ IPO ఏప్రిల్ 28న ప్రారంభమై, ఏప్రిల్ 30న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ ప్రక్రియ ఏప్రిల్ 25 నుంచి మొదలవుతుంది.

యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం రూ.7,118 కోట్లు

ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.7,117.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది ముందటి ఆర్థిక సంవత్సరం (2023-24) ఇదే త్రైమాసికంలో సాధించిన రూ.7,129.67 కోట్ల కంటే స్వల్పంగా తగ్గినప్పటికీ, మొత్తం ఆదాయం రూ.35,990 కోట్ల నుంచి రూ.38,022 కోట్లకు పెరిగింది. బ్యాంక్‌లో స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) రేటు 1.43% నుంచి 1.28%కు మెరుగుపడగా, నికర ఎన్‌పీఏలు 0.31% నుంచి 0.33%కు స్వల్పంగా పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం 6% వృద్ధితో రూ.13,811 కోట్లకు చేరుకోగా, నికర వడ్డీ మార్జిన్ 3.97%గా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరం (2024-25)లో బ్యాంక్ నికర లాభం రూ.26,373 కోట్లకు చేరింది. ఇది 2023-24లో రూ.24,861 కోట్లతో పోలిస్తే గణనీయమైన వృద్ధి అని కంపెనీ తెలిపింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.1,31,810 కోట్ల నుంచి రూ.1,47,934 కోట్లకు పెరిగినట్లు ప్రకటించింది.

Updated Date – Apr 25 , 2025 | 10:36 PM

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights