
అప్పుడే పుట్టిన నవజాత శిశువును నిండుగా గుడ్డలో చుట్టి పడుకోబెట్టడం మీరు చాలా సార్లు చూసే ఉంటారు. పిల్లలను ఇలా నిద్రపుచ్చడానికి అసలు కారణం చాలా మందికి తెలియదు. నిజానికి, ఈ రకమైన అలవాటు ఎన్నో యేళ్లుగా కొనసాగుతోంది. ఇప్పటికీ దీనిని అనుసరించే వ్యక్తులు ఉన్నారు. కానీ కొంతమంది పిల్లలను ఈ విధంగా నిద్రపుచ్చడానికి అంగీకరించరు. పిల్లలకు స్నానం చేయించి, ఊయల లేదా మంచంపై మామూలుగా పడుకోబెడతారు. ఎందుకంటే ఇలా పిల్లలను వస్త్రంలో చుట్టడం వారిని హింసించినట్లు అవుతుందని భావిస్తుంటారు. నిజానికి, పిల్లలను ఇలా ఎందుకు చేయాలి? ఇలా చేయకపోతే ఎమవుతుంది? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా, పిల్లలకు స్నానం చేయించిన తర్వాత వారి శరీరాన్ని కాటన్ వస్త్రంతో పూర్తిగా తుడిచి, ఆ తరువాత శిశువును మృదువైన, తేలికైన వస్త్రంలో పూర్తిగా చుట్టి, చేతులు, కాళ్ళు కదలకుండా కట్టి వేస్తారు. ఈ అభ్యాసం పిల్లలపై వేధింపులుగా మీకు అనిపించవచ్చు. పిల్లలను ఎందుకు హింసించాలి అని కొంతమంది అడుగుతారు కూడా? కానీ దీనివల్ల పిల్లలకు కష్టతరం అవుతుందనేది పూర్తి అసంబద్ధం. పిల్లలను ఈ విధంగా నిద్రపుచ్చడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి.
నవజాత శిశువులకు స్నానం చేయించి నిద్రపుచ్చిన తర్వాత ఈ విధంగా చుట్టే ఆచారం మన పూర్వికుల కాలం నుంచి అవలంబిస్తున్నారు. పెద్దల అభిప్రాయం ప్రకారం, ఇలా చేయడం వల్ల శిశువు వెచ్చగా ఉంటుంది. బయటి గాలి తలపైకి రాకుండా నిరోధించబడుతుంది. శిశువు చేతులు, కాళ్ళు వాపు రాకుండా, సరిగ్గా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. అందుకే ప్రతిరోజూ పిల్లలను గుడ్డలో చుట్టి నిద్రపుచ్చుతారు.
శాస్త్రీయ కారణం ఏమిటి?
ఇలా చేయడానికి ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు, వెచ్చని గూడులో ఉన్నట్లుగా ఉంటుంది. ఒకసారి బిడ్డ బయటకు వస్తే, అంతా కొత్తగా ఉంటుంది. చిన్న చిన్న శబ్దాలకు కూడా భయపడటం ప్రారంభిస్తారు. అలాగే, బిడ్డ నిద్రపోతున్నప్పుడు చేతులు, కాళ్ళు కదులుతుంటే వారు మేల్కొనే అవకాశం ఉంది. అందుకే వైద్యులు పడుకునే ముందు పిల్లలను బట్టలతో చుట్టమని సిఫార్సు చేస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లల చేతులు, కాళ్ళు నిటారుగా ఉంటాయి. తద్వారా వారు నడిచే వయస్సులో కూడా వారికి ఎటువంటి సమస్యలు ఉండవు.
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం వైద్యులను సంప్రదించడం మర్చిపోవద్దు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.