బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఎట్టకేలకు సీబీఐ దశలవారీగా దర్యాప్తును ముగించినట్టు సమాచారం. 2020లో దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసుకు సంబంధించిన రెండు ప్రధాన ఫైళ్లను మూసివేస్తూ, ముంబై కోర్టులో క్లోజర్ రిపోర్టును దాఖలు చేసినట్లు అధికారి వర్గాలు వెల్లడించాయి. ఈ నివేదికల ప్రకారం, సుశాంత్ మరణానికి ఎటువంటి కుట్ర, హత్య, లేదా ఫౌల్ ప్లే ఆధారాలు దొరకలేదని స్పష్టమైంది. సుశాంత్ తండ్రి కే.కే. సింగ్ ఫిర్యాదు మేరకు, 2020లో పాట్నా పోలీస్ స్టేషన్‌లో దాఖలైన కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. ముఖ్యంగా రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై ఆత్మహత్య ప్రేరేపణ, ఆర్థిక మోసం, మానసిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మరోవైపు రియా కూడా సుశాంత్ సోదరీమణులపై నకిలీ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారంటూ ముంబైలో కేసు పెట్టింది.
అయితే నాలుగేళ్ల దర్యాప్తు తర్వాత CBI ఇచ్చిన నివేదికలు సుశాంత్ మరణం వెనుక ఎటువంటి కుట్ర లేదన్నది స్పష్టం చేస్తున్నాయి. 2020 జూన్ 14న ముంబై బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ ఉరేసుకుని చనిపోయినట్లు గుర్తించారు. మృతదేహానికి ముంబై కూపర్ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం జరిపారు.
అటు సుశాంత్ తండ్రి న్యాయం దొరుకుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే సీబీఐ వైఖరిపై నిరాశ వ్యక్తం చేస్తూనే, కోర్టులో అసలైన సత్యం బయటపడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.