Suryapet: ఎదురొచ్చిన మృత్యువు

Written by RAJU

Published on:

  • ఆర్టీసీ బస్సు, కారు ఢీ

  • కారులో ఉన్న 11 మందిలో..

  • దంపతులు, వారి కుమార్తె మృతి

  • కుమారుడి పరిస్థితి విషమం

  • సూర్యాపేట జిల్లా చివ్వెంలలో ఘటన

సూర్యాపేటక్రైం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ప్రయాణిస్తున్న ఓ కారు, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న 11 మందిలో భార్యభర్తలు, వారి కుమార్తె సహా ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఆ దంపతుల కుమారుడి పరిస్థితి విషమంగా ఉండగా.. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం కాంటాయపాలెం గ్రామానికి చెందిన గడ్డం రవీందర్‌(34) తన భార్య రేణుక(29), కుమార్తె రితిక(7), కుమారు రిషికృష్ణతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. భార్య తరఫున బంధువుల ఇంట్లో నిర్వహించిన ఉప్పలమ్మ పండుగ కోసం రవీందర్‌ కుటుంబసమేతంగా సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం కోటపహాడ్‌ గ్రామానికి తన కారులో వచ్చాడు. బంధువులతో సరదాగా గడిపి మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రవీందర్‌ కుటుంబం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైంది. అయితే, వారితోపాటు బంధువులైన కడారి కరుణాకర్‌, ఆయన భార్య పుష్ప, గంధం మధు, సాత్విక దంపతులు, వారి పిల్లలు గంధం గగన్‌చందర్‌, గంధం మల్లికార్జున్‌, కడారి జస్విన్‌ అనే మరో బాలుడు కలిపి మొత్తం 11మంది ఆ కారులో బయలుదేరారు. అయితే, సాయంత్రం ఐదు గంటల సమయంలో చివ్వెంల మండలం బీబీగూడెం సమీపంలోకి రాగానే కారు.. సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్తున్న పల్లెవెలుగు బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అవ్వగా.. రవీందర్‌, రేణుక, రితిక అక్కడికక్కడే మృతి చెందారు. రవీందర్‌ కుమారుడు రిషికృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. అతడిని మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి.

హనుమకొండ జిల్లాలో ..

హసన్‌పర్తి: హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో టిప్పర్‌ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. హసన్‌పర్తి మండలం సీతంపేటకు చెందిన స్నేహితులు దుర్గం పవన్‌కల్యాణ్‌ (22), బౌతు మహేశ్‌ (20) ఆదివారం బైక్‌పై హసన్‌పర్తికి వెళ్లి సీతంపేటకు తిరిగి వస్తున్నారు. మార్గమధ్యలో ఓ మూల మలుపు వద్ద నేషనల్‌ హైవేకు మట్టి తరలిస్తున్న ఓ టిప్పర్‌ వారి బైక్‌ను అతి వేగంగా ఢీకొట్టింది. దీంతో పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలంలో ఇద్దరు యువకుల మృతదేహాలను చూసిన టిప్పర్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానికులు చెప్పారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు. పవన్‌ కల్యాణ్‌ మెకానిక్‌గా పనిచేస్తూ, మహేశ్‌ కూలీ పనులకెళుతూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. చేతికందొచ్చిన కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

  • ఔటర్‌పై రెండు కార్లు ఢీ

  • ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు

నార్సింగ్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): డ్రైవర్‌ నిద్రమత్తో లేదా అతి వేగం కారణంగానో ఔటర్‌పై ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి ఎగిరి రోడ్డుకి అవతలివైపు వస్తున్న మరో కారుపై పడింది. హైదరాబాద్‌ నార్సింగ్‌ సమీపంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పా నుంచి నార్సింగ్‌ వైపు వస్తున్న కారు నార్సింగ్‌ టోల్‌ గేట్‌ సమీపంలో డివైడర్‌ను ఢీ కొట్టి గాల్లోకి ఎగిరి అటు పక్క శంషాబాద్‌ వెళ్తున్న మరో కారుపై పడింది. ఈ ప్రమాదంలో డివైడర్‌ను ఢీ కొట్టిన కారు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందగా, శంషాబాద్‌ వైపు వెళ్తున్న కారులోని ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన కారు డ్రైవర్‌ను శివరాంపల్లికి చెందిన ఆనంద్‌ కామ్లేగా గుర్తించారు. ప్రమాదం నిద్రమత్తుతోనా లేదా అధిక వేగం కారణంగా జరిగిందా అని విచారిస్తున్నారు.

Subscribe for notification