Supreme There అక్కడ వారిదే హవా!

Written by RAJU

Published on:

బినామీల చేతుల్లో మున్సిపల్‌ దుకాణాలు

కొన్నాళ్లుగా జరుగుతున్న తంతు

పార్వతీపురం పురపాలక సంఘం ఆదాయానికి గండి

అధికారుల చర్యలు శూన్యం

పార్వతీపురం టౌన్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పార్వతీపురం మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో బినామీల హవా కొనసాగుతోంది. అసలైన లీజుదారుల నుంచి షాపులన్నీ వారి చేతుల్లోకి వెళ్లిపోవడంతో మున్సిపాల్టీ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. బినామీల నుంచి లీజుదారులు అధిక మొత్తంలో అద్దెలు వసూలు చేస్తున్నప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారు. వాస్తవంగా షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని 50 దుకాణాల్లో ఒకదానిని మున్సిపల్‌ ప్రజారోగ్యశాఖ స్టోర్‌ రూముగా వినియోగిస్తోంది. 34 షాపులు లీజు, సబ్‌ లీజుదారుల చేతుల్లో ఉన్నాయి. మిగతా 15 దుకాణాలకు సంబంధించి ఒకరిద్దరు లీజుదారులు తప్ప మిగతా వారు సక్రమంగా అద్దెలు చెల్లించడం లేదు. అధికారుల లెక్కల ప్రకారం ప్రతినెలా రూ.4 లక్షల వరకు మాత్రమే అద్దెల రూపంలో వస్తుందని తెలుస్తోంది. మరోవైపు షాపింగ్‌ కాంప్లెక్స్‌ కూడా శిథిలావస్థకు చేరింది. పరిస్థితి దయనీయంగా ఉన్నా.. అటు పాలకవర్గం.. ఇటు అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

2007లో అప్పటి ప్రభుత్వం ఐడీఎస్‌ఎంటీ నిధులు సుమారు రూ.76.51 లక్షలతో 50 దుకాణాలతో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టారు. 2008లో నిరుద్యోగ యువత, ఔత్సాహిక వ్యాపారులకు ఆయా షాపులను కేటాయించారు. అయితే ప్రధాన రహదారి, పాతబస్టాండ్‌, ప్రధాన మార్కెట్‌, మున్సిపల్‌ కార్యాలయం వైపు ఉన్న సుమారు 30 షాపులు మాత్రమే లీజుకు తీసుకున్నారు. మిగిలిన 20 దుకాణాలను 2012 వరకు లీజు ప్రాతిపదికన తీసుకురావడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియక మున్సిపల్‌ రెవెన్యూ అధికారులు తలలు పట్టుకున్నారు. ఇదే సమయంలో లీజుదారులు తమ షాపులను సబ్‌ లీజు కింద మరొకరి అధిక అద్దె ప్రాతిపదికన ఇవ్వడం మొదలు పెట్టారు. సబ్‌ లీజు ప్రక్రియలో బినామీల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నప్పటికీ అప్పట్లో రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. అద్దెలు సకాలంలో చెల్లిస్తే చాలనుకున్నారు. మెల్లమెల్లగా ప్రధాన రహదారి, పాతబస్టాండ్‌, మున్సిపల్‌ కార్యాలయంతో పాటు ప్రధాన మార్కెట్‌ వైపు ఉన్న షాపులు బినామీల చేతుల్లోకి వెళ్లిపోయాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పాలకవర్గం సభ్యులు బినామీల ఏరివేతకు రంగం సిద్దం చేశారు. అయితే ఎక్కడో తేడా జరగడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు.

అద్దెల పెంపుతో..

షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ప్రధాన రహదారి, పాతబస్టాండ్‌, మున్సిపల్‌ కార్యాలయం వైపుతో పాటు ప్రధాన మార్కెట్‌ వైపున్న షాపులకు 2015లో అద్దెలు పెంచారు. అయితే ఇదే అదునుగా లీజుదారులు (కొంతమంది రాజకీయపార్టీల నాయకులు) సబ్‌ లీజుదారులకు (అదే బినామీలు) షాపులు తమకు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. ఏం చేయాలో తెలియని బినామీలు అధిక అద్దెలు చెల్లించడానికి ఒప్పందం కుర్చుకున్నారు. తాము మున్సిపాల్టీకి చెల్లించే అద్దెల కంటే రెండింతలు పెంచాలని లీజుదారులు చెప్పడంతో బినామీలు సరే అనాల్సి వచ్చింది. అయితే నాటి నుంచి ఇప్పటి వరకు వారు షాపుల్లో దర్జాగా వ్యాపారాలు చేసుకుంటున్నారు.

శిథిలాస్థలో..

సుమారు 20 ఏళ్ల కిందట నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ అధ్వానంగా మారింది. నిర్వహణకు నోచక పూర్తి శిథిలావస్థకు చేరింది. శ్లాబ్‌ పెచ్చులు ఊడిపోవడంతో వ్యాపారులతో పాటు కొనుగోలుదారులు భయాందోళన చెందుతున్నారు. రక్షణ గోడలు కూడా లేకపోవడంతో చీకటి పడితే చాలు.. ఆ ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కొంతమంది లీజు దారులు, బినామీల ఆటకట్టించి, షాపింగ్‌ కాంప్లెక్స్‌ మరమ్మతు పనులు చేపట్టేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని జిల్లాకేంద్రవాసులు కోరుతున్నారు.

ఉపేక్షించేది లేదు..

మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో దుకాణాలపై కమిషనర్‌, పాలకవర్గ సభ్యులతో చర్చిస్తాం. అనంతరం నిజమైన లీజుదారులు, సబ్‌ లీజుదారులు తదితర వాటిపై విచారణ చేపడతాం. బినామీలు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు.

– డి.రూబేను, రెవెన్యూ అధికారి, పార్వతీపురం మున్సిపాల్టీ

Subscribe for notification
Verified by MonsterInsights