Supreme Court Grants Relief to Shivraj Singh Chouhan in Defamation Case, Stays Arrest Warrant

Written by RAJU

Published on:

  • శివరాజ్ సింగ్ చౌహాన్‌పై గతంలో పరువు నష్టం కేసు
  • తాజాగా సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట
  • వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు
Supreme Court Grants Relief to Shivraj Singh Chouhan in Defamation Case, Stays Arrest Warrant

కేంద్ర వ్యవసాయ శాఖ  మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. కోర్టు ఆయనకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కొనసాగించింది. అనంతరం ఈ కేసు విచారణను జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం మార్చి 26కి వాయిదా వేసింది. అంతకుముందు.. శివరాజ్ సింగ్ చౌహాన్‌పై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టివేయడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. దీంతో చౌహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ సహా ముగ్గురు బీజేపీ నాయకులపై జారీ చేసిన వారెంట్‌ను సుప్రీంకోర్టు నిలిపివేసింది.

విషయం ఏంటంటే?
కాంగ్రెస్ ఎంపీ వివేక్ తంఖా.. శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు విడి శర్మ, మాజీ మంత్రి భూపేంద్ర సింగ్ లపై పరువు నష్టం దావా వేశారు. రాజకీయ లబ్ధి కోసం తన ఇమేజ్‌ను దిగజార్చారని టంఖా ఆరోపించారు. మధ్యప్రదేశ్ పంచాయతీ ఎన్నికల సమయంలో తనను OBC రిజర్వేషన్లకు వ్యతిరేకిగా అభివర్ణించారని టంఖా పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో గతేడాది జనవరి 20న జబల్‌పూర్‌లోని ప్రత్యేక న్యాయస్థానం ముగ్గురు బీజేపీ నేతలపై ఐపీసీ సెక్షన్ 500 కింద పరువునష్టం కేసు నమోదు చేసి కోర్టుకు సమన్లు ​​జారీ చేసింది.

కాగా.. అంతకుముందు శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరుల తరఫున సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. వివేక్ తంఖా ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలు సభా వేదికపైనే చేశారని, అవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 (2) కిందకు వస్తాయని తెలిపారు. ఆర్టికల్ 194 (2) ప్రకారం, శాసన సభ లేదా దాని కమిటీలో చెప్పిన ఏదైనా ఓటుకు సంబంధించి రాష్ట్ర శాసనసభలోని ఏ సభ్యుడైనా ఏ న్యాయస్థానంలోనూ ఎటువంటి విచారణకు బాధ్యత వహించబోడని స్పష్టం చేశారు. 2021లో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా శివరాజ్ సింగ్ తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని తంఖా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సమన్లకు సంబంధించిన కేసులో కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని, దీనిలో పార్టీలు న్యాయవాది ద్వారా హాజరు కావచ్చని ఎప్పుడూ వినలేదని మహేష్ జెఠ్మలానీ వాదించారు. బెయిలబుల్ వారెంట్ అమలుపై స్టే ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.

Subscribe for notification