Sunita Williams: సునీతా విలియమ్స్ జీవిత ప్రయాణం సాహసాలతో నిండి ఉంది. 286 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన ఆమె, 17 గంటల ఉత్కంఠ భరిత ప్రయాణం తర్వాత క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌తో భూమికి చేరుకుంది. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో క్యాప్సూల్ నీటిలో దిగిన క్షణం, ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. సునీతా, సహచర వ్యోమగామి బుచ్ విల్‌మోర్ కాప్సూల్ నుంచి బయటకు వచ్చి, చేతులు ఎత్తి ప్రపంచానికి అభివాదం చేశారు. చిరునవ్వుతో అందర్నీ పలకరించారు. నిజానికి ఇది ఆమెకు చివరి దశ కాదు.. కొత్త పరీక్ష ఆరంభం. 45 రోజుల పాటు రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అంతరిక్షంలో గడిపిన సమయం ఆమె శరీరంపై తీవ్ర ప్రభావం చూపింది. మైక్రో గ్రావిటీ ప్రభావంతో ఎముకలు బలహీనపడ్డాయి, కండరాలు గట్టి పడిపోయాయి, గుండె తన సహజ విధానాన్ని కోల్పోయింది. భూమిపై అడుగుపెట్టగానే శరీరం తడబడే అవకాశం ఉంది. అందుకే సునీతా, బుచ్ విల్‌మోర్‌ను వీల్‌చైర్‌లోనే రీహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు.
ఈ 45 రోజుల సమయంలో ఆమె శరీరంలో మార్పులను విశ్లేషిస్తారు. బరువు తగ్గడం, ఎముకల బలహీనత, నాడీ వ్యవస్థ ప్రభావాన్ని పరీక్షిస్తారు. గుండె మళ్లీ సాధారణంగా పని చేయడానికి ప్రత్యేక వ్యాయామాలు అవసరం. నడక మళ్లీ అలవాటు చేసుకోవాలి. జీరో గ్రావిటీతో పాటు, అంతరిక్షంలో వ్యోమగాములకు మరో పెద్ద సమస్య రేడియేషన్. భూమి మాగ్నెటిక్ ఫీల్డ్ సూర్య రశ్ములను నిరోధిస్తుంది, కానీ అంతరిక్షంలో అలాంటి రక్షణ ఉండదు. వ్యోమగాములు భూమిపైన ఉన్న వారికంటే వందల రెట్లు ఎక్కువ రేడియేషన్‌ను ఎదుర్కొంటారు. 286 రోజులు అంతరిక్షంలో గడిపిన సునీతా శరీరం దీని ప్రభావాన్ని ఎక్కువగా అనుభవించింది. రేడియేషన్ కారణంగా నాడీ వ్యవస్థ, గుండె పనితీరు, రక్త కణాలు, డీఎన్ఏ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఈ మార్పులను అర్థం చేసుకోవడానికి నాసా ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తుంది.
అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన వ్యోమగాములకు మానసిక మార్పులు సంభవిస్తాయి. భూమిపై తిరిగి వచ్చినా, కొన్ని రోజుల పాటు ఒంటరితనం, విచిత్రమైన అనుభూతులు ఉంటాయి. ఇది గతంలో కూడా చాలా వ్యోమగాములకు ఎదురైంది. 1969లో చంద్రునిపై అడుగుపెట్టిన ఆర్మ్‌స్ట్రాంగ్, ఆల్డ్రిన్ తిరిగి వచ్చినప్పుడు నడవడం కష్టంగా అనిపించింది. 1994లో వాలేరీ 437 రోజుల అనంతరం భూమిపై నిలబడటానికి 6 నెలలు పట్టింది.