Water Intake in Summer: నీరు శరీరానికి ఇంధనంలా పనిచేస్తుంది. ఇక వేసవి కాలం వచ్చేసరికి మరింత నీరు అవసరమవుతుంది. ఉక్కపోత కారణంగా చెమట ద్వారా చాలా నీరు బయటికి వచ్చేస్తుంటుంది. కాబట్టి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ ఎక్కువమంది ప్రజలు తగినంత నీరు తాగరు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి, సమ్మర్‌లో ఒక వ్యక్తి రోజుకు ఎంత నీరు తాగాలి.. తక్కువ తాగితే ఏమవుతుంది.. ఎక్కువ తాగితే ఏమవుతుంది..అనే సందేహాలకు ఇక్కడ సమాధానం తెలుసుకుందాం..
వేసవిలో ఎంత నీరు తాగాలి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేసవిలో పెద్దలు సాధారణంగా రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగాలి. అంటే ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు తాగాలి. అయితే ఈ పరిమాణం వ్యక్తి శారీరక శ్రమ, వాతావరణం, ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఎక్కువ వ్యాయామం లేదా శారీరకంగా కష్టతరమైన పని చేసేవారైతే ఇంకా ఎక్కువ నీరు తాగవలసి ఉంటుంది. అలాగే వేడి వాతావరణంలో నివసించే ప్రజలు కూడా అధిక మోతాదులో నీరు తీసుకోవాలి.
ఎక్కువ నీరు తాగటం మంచిదేనా..
ఎండాకాలంలో పదే పదే దప్పికగా ఉందని అవసరానికి మించి నీరు తాగటం మంచిది కాదు. అలా చేస్తే తలనొప్పి, కడుపులో అసౌకర్యం, పదే పదే మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం ఒక్కటే కాదు. రక్తంలో సోడియం లెవల్స్ పెరిగిపోయి హైపోనెట్రేమియా అనే సమస్య వస్తుంది. కొన్నిసార్లు వాటర్ పాయిజనింగ్ కారణంగా శ్వాసక్రియకు తీవ్ర ఆటంకం కలగవచ్చు.
తక్కువ నీరు తాగితే ఏమవుతుంది?
మన శరీరంలో జీవక్రియలన్నీ సక్రమంగా జరగాలంటే తగినంత నీరు తప్పక తీసుకోవాల్సిందే. శరీరం హైడ్రేట్ చేసి ఆరోగ్యంగా ఉంచడంలో నీటిదే ప్రధాన పాత్ర. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించి తక్కువ నీరు తాగితే శరీరంలో అవయవాల పనితీరు దెబ్బతింటుంది. చిన్న సమస్యలతో మొదలై తీవ్రమైన వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కింద ఇచ్చిన ఈ 3 రకాల అనారోగ్యాలు మిమ్మల్ని చుట్టుముడతాయి.
1. డీహైడ్రేషన్
శరీరానికి కావాల్సినంత నీరు అందించకపోతే అలసట, తలతిరగడం, తలనొప్పి, నోరు పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు తీవ్రమైతే మూర్ఛపోయే ప్రమాదం పెరుగుతుంది. ఈ స్థితినే డీహైడ్రేషన్ అంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ రోజూ పుష్కలంగా నీరు తాగుతూనే ఉండాలి.
2. జీర్ణ సమస్యలు
జీర్ణక్రియకు నీరు చాలా ముఖ్యం. తక్కువ నీరు తాగే వాళ్లనే ఎక్కువగా మలబద్ధకం సమస్య వేధిస్తూ ఉంటుంది. వేసవిలో ఈ సమస్యకు అదనంగా, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు.
3. మూత్రపిండాలు
మూత్రపిండాలు శరీరం నుండి విషపూరిత పదార్థాలు, వ్యర్థాలను తొలగించి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి సక్రమంగా పనిచేయడంలో నీటిదే ముఖ్యమైన పాత్ర. ఒకవేళ మీరు తక్కువ నీరు తాగితే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా మూత్రపిండాల్లో రాళ్ళు లేదా ఇతర మూత్ర సమస్యలు వచ్చే ప్రమాదముంది. కాబట్టి, ఈ సమస్యల నివారించేందుకు ఒక వ్యక్తి రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరైనా తాగాలి.
Read Also: Kidney Health: కిడ్నీ సమస్యలు ఉన్నవారు బెల్లం తింటే ఏమవుతుంది..
Diabetes Suggestions : డయాబెటిస్ ఉన్నవారు వేసవిలో పుచ్చకాయ తినడం మంచిదేనా..
Diabetes Tips: షుగర్ పేషెంట్లు చెరకు రసం తాగొచ్చా.. తాగకూడదా..