
వేసవిలో వచ్చే తల నొప్పిని నివారించడానికి ఇంట్లోనే సహజ పద్ధతుల్లో కొన్ని చిట్కాలు ట్రై చేయవచ్చు. ముఖ్యంగా వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో నువ్వుల నూనె చాలా సహాయపడుతుంది. ప్రతిరోజూ నువ్వుల నూనెతో తలకు సున్నితంగా మసాజ్ చేసుకోవడం వల్ల శరీరం అలసట, తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్ల తలనొప్పి వస్తుంది. వీలైనంత వరకు నీడ ప్రాంతాల్లో ఉండటానికి ప్రయత్నించాలి.
తలనొప్పిని నివారించడానికి తొలుత ఎండకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఇది తలనొప్పిని నివారిస్తుంది. ఒకవేళ ఎండలో బయటకు వెళ్ళవలసి వస్తే, గొడుగు తీసుకెళ్లడం లేదా తలపై స్కార్ఫ్ లేదా టోపీ ధరించడం మంచిది. ఇటువంటి ముందు జాగ్రత్త చర్యలు తలనొప్పిని నివారించడంలో సహాయపడతాయి. ఈ వేసవిలో ఎండ వల్ల వచ్చే తలనొప్పికి ఇంట్లోనే ఈ కింది విధంగా చికిత్స తీసుకోండి..
- తులసి, అల్లంతో తయారు చేసిన టీ తయారు చేసి తాగాలి. ఎందుకంటే ఈ టీ తలనొప్పిని తగ్గించడానికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈ టీ తాగడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఎందుకంటే ఇది పూర్తిగా సహజమైనది.
- అలాగే మజ్జిగ కూడా ప్రభావ వంతంగా పనిచేస్తుంది. దీన్ని తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. వేసవిలో చల్లని మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా దాహం కూడా తీరుతుంది. ఇది శరీరంలో నీటి నిలుపుదలని పెంచడానికి సహాయపడుతుంది. మజ్జిగ తాగడం వల్ల తలనొప్పి, అలసట తగ్గుతాయి.
- తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలు తినాలి. అవును.. మజ్జిగ, చల్లని పండ్లు, సలాడ్లు వంటి ఆహారాలు శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. అవి శరీర ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తాయి.
- తగిన విశ్రాంతి అవసరం. శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వడం ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. విశ్రాంతి సమయంలో శరీరం ఉత్తేజితమై ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి విశ్రాంతి తలనొప్పి తీవ్రతను తగ్గిస్తుంది.
- యోగా, ప్రాణాయామం చేయాలి. ఇది వెంటనే తగ్గకపోయినా, భవిష్యత్తులో తలనొప్పి రాకుండా చేస్తుంది. వ్యాయమాలు శరీరాన్ని ప్రశాంతపరుస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా తలనొప్పిని నివారిస్తాయి. ముఖ్యంగా వేసవిలో వ్యాయామాలు చేయడం వల్ల శరీరం వేడెక్కకుండా ఉంటుంది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.