అలోవెరా మార్కెట్లో సరసమైన ధరలకు లభించే ఒక నేచరల్ ఔషధం. అంతేకాదు ఇది ఇంటిలో కూడా పెరుగుతుంది. కలబంద ఆరోగ్యానికి , చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కలబంద గుజ్జు , రసం వలన అనేక ప్రయోజనాలున్నాయి. గాయాలను నయం చేయడం మాత్రమే కాదు ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కోసం కూడా దీనిని ఉపయోగించవచ్చు. కలబందలో అనేక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఆయుర్వేదంలో కలబందను అనేక ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. మీరు కూడా దీనిని వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు. ఈ రోజు జుట్టు, చర్మ సంబంధిత సమస్యల నివారణకు కలబందను ఎలా ఉపయోగించాలో ఈ రోజు తెలుసుకుందాం.
రసాయన వస్తువుల కంటే.. సహజ వస్తువులను ఉపయోగించడం ఆరోగ్యం, చర్మం, జుట్టుకు మరింత ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. సహజమైన వస్తువులు నెమ్మదిగా పనిచేసినప్పటికీ.. అవి మంచి ఫలితాలను ఇస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే గత కొంత కాలం క్రితం వరకూ అంటే అమ్మమ్మల కాలంలో ఇలాంటి చిట్కాలను ఎక్కువగా ఉపయోగించేవారు. చర్మం, జుట్టు సంరక్షణ కోసం కలబందను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
ముఖం మీద సహజ మెరుపు: ప్రతి ఒక్కరూ ముఖం అందంగా మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. దీనికి కలబంద మంచి మెడిసిన్. కలబంద గుజ్జుని, విటమిన్ ఇ క్యాప్సూల్‌తో కలిపి ముఖం నుంచి మెడ వరకు అప్లై చేసి 20 నుంచి 25 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ని వారానికి రెండు మూడు సార్లు ఉపయోగించడం వలన కొన్ని రోజుల్లోనే ముఖం మీద ఉన్న మచ్చలు, మొటిమలు తగ్గడం ప్రారంభమవుతాయి. ముఖం అందంగా మారుతుంది. ఈ మిశ్రమం చర్మాన్ని కూడా బిగుతుగా చేస్తుంది.
జుట్టు సిల్కీ-మెరవాలంటే: కలబందలో హైడ్రేటింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మానికి, జుట్టుకు తేమను అందిస్తాయి. జుట్టు సిల్కిగా ఉంచడం కోసం కలబంద గుజ్జులో పెరుగు, గుడ్డువేసి కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయండి. ఈ హెయిర్ ప్యాక్ వేసుకున్న మొదటిసారిగానే మీకు గొప్ప ఫలితం కనిపిస్తుంది. జుట్టు సిల్కీగా మెరుస్తుంది.
పొడిబారిన చర్మం మృదువుగా మారాలంటే: చర్మం ఎక్కువగా పొడిగా ఉంటే.. వీరికి కలబంద ఒక అద్భుతమైన మెడిసిన్. దీని కోసం కలబంద జెల్‌ను తేనె, రోజ్ వాటర్ , రెండు నుండి మూడు చుక్కల కొబ్బరి నూనెతో కలిపి ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. దీనివల్ల చర్మం మృదువుగా మారి పొడిబారడం తగ్గుతుంది.
చుండ్రు నివారణకు: జుట్టు రాలడానికి చుండ్రు కూడా ఒక ప్రధాన కారణం. కనుక చుండ్రు తగ్గడం కోసం కలబంద గుజ్జును పెరుగు, నిమ్మకాయతో కలిపి అప్లై చేయవచ్చు. అంతేకాదు ఏదైనా సున్నితమైన స్క్రబ్‌తో కొంత కలబంద జెల్‌ను కలిపి ఈ మిశ్రమాన్ని తలపై మసాజ్ చేసి.. అనంతరం జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన చుండ్రు తగ్గుతుంది. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల చుండ్రు త్వరగా తగ్గుతుంది.