
శ్రీ రామ నవమి హిందువులు జరుపుకునే పండగలలో ముఖ్యమైన పండగ. నవమీ రోజు నుంచి తొమ్మది రోజుల పాటు తెలుగు లోగిళ్ళు శ్రీ రామ నవమి సందడితో నిండిపోతాయి. అందాల రాముడు కల్యాణ వేడుకని జరిపించేందుకు, సీతారాముల జంటని చూసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. కోదండరాముడి కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు రాములోరి భక్తులు రెడీ అవుతున్నారు. సీతారాముల కళ్యాణం రోజున పానకం, వడపప్పు, చలిమిడి, శనగలు నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత వీటిని భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తారు. ఈ రోజు పానకం వడపప్పు ఎలా తయారు చేస్తారు.? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు :
బెల్లం – అర కేజీ
మిరియాలపొడి – ఒక టేబుల్ స్పూన్
శొంఠిపొడి – ఒక టేబుల్ స్పూన్
యాలకులపొడి – రెండు టేబుల్ స్పూన్లు
నిమ్మరసం – ఒక చెక్క
తులసీ దళాలు- 15
ఉప్పు – చిటికెడు
పచ్చకర్పూరం – చిటికెడు
నీరు – ఒక లీటరు
తయారీ విధానం : ముందుగా బెల్లాన్ని తరిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో లీటర్ నీరు పోసుకుని అందులో బెల్లం తరుగు వేసి బెల్లం కరిగించాలి. ఇప్పుడు ఆ బెల్లం నీరుని మరొక గిన్నెలోకి వదకట్టుకోవాలి. ఇప్పుడు ఆ నీటిలో నిమ్మరసం, మిరియాల పొడి, యాలకుల పొడి, శొంఠి పొడి వేసి కలపాలి. తర్వాత ఒక పించ్ సాల్ట్, పచ్చ కర్పూరం వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా తులసి దళాలు వేసుకుంటే రామయ్యకు ఇష్టమైన ఎంతో టేస్టీ టేస్టీ తియ్యతియ్యటి బెల్లం పానకం నైవేద్యంగా రెడీ అయినట్లే..
వడపప్పు తయారీకి కావాల్సిన పదార్ధాలు
పెసర పప్పు – ఒక కప్పు
పచ్చి మిర్చి – 3
నిమ్మరసం – ఒక స్పూన్
కొబ్బరి తురుము – మూడు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర- కొంచెం
తయారీ విధానం: పెసర పప్పుని శుభ్రం చేసి నీటిలో నానబెట్టుకోవాలి. అప్పటికప్పుడు ఈ వడపప్పుని రెడీ చేసుకోవాలనుకుంటే పెసర పప్పుని వేడి నీటిలో ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. తర్వాత పెసర పప్పుని నీటి వడకట్టుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు పెసర పప్పులో సన్నగా తరిగిన పచ్చి మిర్చి ముక్కలు, కొంచెం సాల్ట్, కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే రాములోరికి ఇష్టమైన రుచికరమైన వడపప్పు నైవేద్యంగా సమర్పించడానికి రెడీ.
పానకం, వడపప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు :
వేసవి సీజన్ లో శ్రీ రామ నవమి పండగ వస్తుంది. ఈ రోజున నైవేద్యంగా సమర్పించే పానకం తాగడం వలన వేసవి తాపాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పానకంలోని బెల్లం, మిరియాల పొడి, తులసి దళాలు, శొంఠి అన్నింటిలో ఔషధ గుణాలున్నాయి. ఎండలకు చిన్నారులు త్వరగా అలసిపోతారు. వీరు పానకం తాగడం వలన నీరసం తగ్గుతుంది. వడపప్పు మలబద్ధకాన్ని తొలగించి, ఆరోగ్యాన్ని ఇస్తుంది. జీర్ణక్రియనూ వృద్ధి చేస్తుంది. ఏడాదికి ఒక్కసారైనా ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే పానకం, వదపప్పుని ప్రసాదంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)