SRH – HCA Free Go Controversy Escalates as Telangana CM Orders Vigilance Inquiry

Written by RAJU

Published on:


  • HCA వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.
  • పాసులు అడిగిన విషయంపై సీఎంఓ కార్యాలయం అధికారులు వివరాలు సేకరణ
  • విచారణ జరపాల్సిందిగా విజిలెన్స్ డిజి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ఆదేశాలు
  • పాసుల కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ హెచ్చరిక.
SRH – HCA Free Go Controversy Escalates as Telangana CM Orders Vigilance Inquiry

SRH – HCA: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (HCA), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) మధ్య జరుగుతున్న వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంప్లిమెంటరీ పాస్‌లు కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంఛైజీని బెదిరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ హోమ్‌ గ్రౌండ్‌ ఉప్పల్‌ స్టేడియాన్ని వదిలిపెట్టే అవకాశం ఉందని కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి హెచ్‌సీఏకు ఒప్పందం ప్రకారం 10% ఉచిత టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా 50 టిక్కెట్ల సామర్థ్యం ఉన్న కార్పొరేట్‌ బాక్స్‌ను హెచ్‌సీఏకు కేటాయించారు. కానీ ఈ ఏడాది, ఆ బాక్స్‌ సామర్థ్యం 30కి తగ్గిందని చెప్పి, అదనంగా మరో 20 టిక్కెట్లు ఇవ్వాలని హెచ్‌సీఏ డిమాండ్‌ చేసింది. దీనిపై చర్చిద్దాం అని ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రతినిధులు సూచించగా.. ఒక మ్యాచ్ సందర్భంగా హెచ్‌సీఏ అధికారులు వారి కార్పొరేట్‌ బాక్స్‌కు తాళం వేశారు. చివరకు 20 టిక్కెట్లు ఇస్తేనే తాళం తీస్తామని హెచ్‌సీఏ ఒత్తిడి తెచ్చిందని ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్‌ జనరల్ మేనేజర్ శ్రీనాథ్‌ హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావుకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖలో గత రెండు సంవత్సరాలుగా హెచ్‌సీఏ పాసులు ఇచ్చినా సరే.. అదనంగా మరికొన్నిపాసులు ఇవ్వాలని HCA వేధిస్తోందని ఆరోపించారు. ఉప్పల్‌ స్టేడియంలో ఆడడం ఇష్టం లేకుండా హెచ్‌సీఏ ప్రవర్తిస్తున్నట్లు అనిపిస్తోందని.. ఈ విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌తో చర్చించి మరొక హోమ్‌ గ్రౌండ్‌ కోసం ఆలోచించాల్సి రావొచ్చని పేర్కొన్నారు.

Read also: Ghibli Images: గిబ్లీ స్టైల్ ఫోటోలు కావాలా? ఈ సులువైన స్టెప్స్ వాడి సులభంగా పొందండి

ఈ ఆరోపణలపై హెచ్‌సీఏ వెంటనే స్పందించింది. ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం అధికారిక ఇమెయిల్‌ ద్వారా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అసత్యమని, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హెచ్‌సీఏ ప్రతిష్ట దెబ్బతీసేందుకు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారని హెచ్‌సీఏ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. సోష‌ల్ మీడియా, పలు వెబ్‌సైట్ల‌లో ప్ర‌చార‌మ‌వుతున్న వార్త‌ల్లో వాస్త‌వం లేదని అధికారులు అంటున్నారు. ఒక‌వేళ నిజంగానే ఈమొయిల్స్ వ‌చ్చుంటే.. ఆ స‌మాచారం హెచ్‌సీఏ లేదా ఎస్ఆర్‌హెచ్ అధికారిక ఈమొయిల్స్ నుంచి కాకుండా గుర్తు తెలియ‌ని ఈమొయిల్స్ నుంచి లీక్ చేయ‌డం వెనుకున్న కుట్ర ఏంటి?. హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్ ప్ర‌తిష్ట‌ను తీసేందుకు కొంద‌రు ప‌నిగ‌ట్టుకొని చేస్తున్న దుష్ప్ర‌చారమని అన్నారు. ఈ -మొయిల్స్ న‌కిలీవా, నిజ‌మైన‌వా? తెలుసుకోవ‌డానికి ఎస్ఆర్‌హెచ్ నుంచి కూడా మీడియా స్ప‌ష్ట‌మైన వివ‌ర‌ణ తీసుకోవాలని హెచ్‌సీఏ అధ్య‌క్ష కార్యాల‌యం పేర్కొంది.

ఇకపోతే ఈ విషయంపై తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురిచేసి పాసులు అడిగిన విషయంపై సీఎంఓ కార్యాలయం అధికారులు వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని పాసుల విషయంలో HCA బెదిరించిందో లేదో అనే అంశంపై విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అంశాన్ని విచారణ జరపాల్సిందిగా విజిలెన్స్ డిజి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసారు. అయితే, ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ హెచ్చరికలు చేసారు. చూడాలి మరి ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటపడనున్నాయో.

Subscribe for notification
Verified by MonsterInsights