రిపేరబిలిటీ ఇండెక్స్ తీసుకురానున్న ప్రభుత్వం
త్వరలో మార్గదర్శకాల జారీ
న్యూఢిల్లీ: కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ త్వరలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లకు రిపేరబిలిటీ సూచీ (ఇండెక్స్)ని తప్పనిసరి చేయబోతోంది. దీని ప్రకారం వీటిని తయారు చేసి అమ్మే కంపెనీలు ఇక తప్పనిసరిగా రేటింగ్ రూపంలో వాటి రిపేరబిలిటీ ఇండెక్స్‌ను సూచించాలి. ఇది ప్రస్తుతం ఇంధన సామర్ధ్యానికి సంబంధించి ఏసీలు, బల్బులు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లకు అమలు చేస్తున్న రేటింగ్స్ రూపంలో ఉంటుంది. తాము కొన్న స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లు, ఇతర కీలక ఎలకా్ట్రనిక్ పరికరాలకు సరైన రిపేర్ సదుపాయాలు లభించడం లేదని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకోబోతోంది. దీంతో వినియోగదారులు ఈ వస్తువులను కొనే ముందే ఈ ఇండెక్స్ ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు.
ఇప్పటికే నివేదిక సమర్పణ
దీనికి సంబంధించి కేంద్ర వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి భారత్ ఖేరా నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇప్పటికే ఒక నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రిపేరబిలిటీ ఇండెక్స్‌కు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేస్తుందని మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిధి ఖరే చెప్పారు. ముందు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లకు ఈ సూచీని అమలు చేసి తర్వాత ల్యాప్‌ట్యా్‌పలు, డెస్క్ టాప్‌లు, ఇతర ఎలకా్ట్రనిక్ పరికాలన్నిటికి విస్తరిస్తారని ఆమె తెలిపారు. ఆయా వస్తువులకు సంబంధించిన రిపేరబిలిటీ ఇండెక్స్‌ను ప్రతి కంపెనీ తన విక్రయ కేంద్రం, ప్యాకింగ్, వెబ్‌సైట్ల ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది.
రేటింగ్ ఇలా
ఎలక్ట్రానిక్ పరికరాల్లోని కీలక విడిభాగాలైన డిస్‌ప్లే స్ర్కీన్లు, బ్యాటరీలు, కెమెరా అసెంబ్లీలు, చార్జింగ్ పోర్టులు, స్పీకర్లను రిపేర్ చేయడానికి ఉన్న అవకాశం, అందుబాటులో ఉండే విడిభాగాలు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ విదానాల ఆధారంగా ఈ రిపేరబిలిటీ ఇండెక్స్ రేటింగ్స్ ఉంటాయి. ఏదైనా ఒక సర్వీస్ సంతృప్తికరంగా ఉంటే ఐదు పాయింట్లు, మధ్యస్థంగా ఉంటే మూడు పాయింట్లు ఇస్తారని భారత్ ఖేరా తెలిపారు. అమెరికా, ఈయూ, ఫ్రాన్స్‌తో సహా అనేక దేశాలు ఇప్పటికే ఈ రిపేరబిలిటీ ఇండెక్స్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఈ విధానానికి సిద్ధమవుతోంది. దీంతో కంపెనీలు తమ ఉత్పత్తుల విషయంలో మరింత బాధ్యతాయుతంగా ఉంటాయని భావిస్తున్నారు.