SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లోకి రోబోలు ఎంటర్ అయ్యాయి. టన్నెల్‌లోకి వెళ్లిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో.. మట్టి తవ్వకాలను వేగవంతం చేస్తోంది. ఫలితంగా టన్నెల్‌లో అదృశ్యమైన మిగిలిన కార్మికులను గుర్తించేందుకు రెస్క్యూ టీమ్‌లు శ్రమిస్తున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ 21రోజులుగా కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా.. కేరళ కెడావర్ డాగ్స్ గుర్తించిన డీ-1, డీ-2 ప్రాంతాల్లో తవ్వకాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. మాన్యువల్ డిగ్గింగ్‌కు బదులుగా ఆటానమస్ హైడ్రాలిక్ పవర్డు రోబోలను వాడుతున్నారు. ఈ రోబో మోడ్రన్ టెక్నాలజీతో టన్నెల్ లోపల డిగ్గింగ్ ప్రక్రియ నిర్వహించనుంది.
డిగ్గింగ్ ప్రక్రియలో ఏర్పడే మట్టిని వేగంగా బయటకు తీయడానికి సహాయపడతాయి. గంటకు 620 క్యూబిక్ మీటర్ల బురదతో కూడిన మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా తరలించనున్నారు అధికారులు. ఈ అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోకు అనుసంధానంగా ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగిస్తున్నారు. 30 హార్స్ పవర్ సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకుతో కూడిన మెషిన్‌లను కూడా టన్నెల్ లోపలికి పంపారు. ఈ యంత్రాలు మట్టిని త్వరగా తొలగించేందుకు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. మరోవైపు.. సహాయక చర్యలకు అడ్డుగా నిలిచిన టీబీఎం వెనక భాగాన్ని గ్యాస్ కట్టర్లు, ప్మాస్లా కట్టర్లు, అల్ట్రా ధర్మల్ కట్టర్లో కత్తిరించి ఎప్పటికప్పుడు ఆ భాగాన్ని లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపుతున్నారు.
ఇక.. ఫిబ్రవరి 22న టన్నెల్‌లో ప్రమాదం జరగ్గా 8 మంది చిక్కుకుపోయారు. 16వ రోజున టన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గురు ప్రీత్ సింగ్ మృతదేహాన్ని మాత్రమే వెలికి తీశారు. పార్ధివ దేహాన్ని పంజాబ్లోని వారి కుటుంబ సభ్యులకు సైతం అప్పగించారు. మిగిలిన ఏడుగురి కోసం రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. ఏడుగురి కార్మికుల జాడ కనిపెట్టేందుకు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 12 రకాల సహాయక బృందాలు నిత్యం శ్రమిస్తూనే ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.