SLBC: ఆ ఏడుగురు ఎక్కడ..? రంగంలోకి రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం.. – Telugu News | SLBC Tunnel Rescue: Robots Join Search for Missing Workers

Written by RAJU

Published on:

18 రోజులు గడుస్తున్నాయి.. ఒక్కరి జాడే తెలిసింది. మిగిలిన ఏడుగురి కోసం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌‌లో అన్వేషణ కొనసాగుతోంది. కేరళకు చెందిన రెండు క్యాడవర్ డాగ్స్‌ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహాల వెలికితీతలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. SLBC టన్నెలో క్యాడవర్ డాగ్స్ గుర్తించిన స్పాట్‌లో తవ్వకాలు జరుపుతున్నారు రెస్క్యూ సిబ్బంది.. గురుప్రీత్‌సింగ్‌ మృతదేహం లభించిన ప్రాంతంలోనే మిగిలిన వారి మృతదేహాలు కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్‌. అందుకే అదే ప్రాంతంలో జాగ్రత్తగా తవ్వకాలు కొనసాగిస్తున్నాయి. అయితే.. మంగళవారం SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో రోబోలు కూడా భాగస్వామ్యం కానున్నాయి..

హైదరాబాద్‌కు చెందిన అన్వీ రోబోటిక్ బృందం ఒక రోబోతో టన్నెల్ లోపలికి వెళ్లింది. టన్నెల్‌లో రోబోను ఎలా ఉపయోగించాలన్న అంశంపై డెమో నిర్వహించనుంది. డెమో తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్‌లోకి మరో రెండు రోబోలను రంగంలోకి దింపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌, హైదరాబాద్‌ అన్వీ రోబోటిక్‌ టీమ్‌తో ఈ ఆపరేషన్‌ కొనసాగనుంది.. ఇప్పటికే క్యాడవర్‌ డాగ్స్‌ గుర్తించిన 2వ స్పాట్‌లో ఏడుగురి ఆచూకీ కోసం తవ్వకాలు జరుపుతున్నామని.. ప్రస్తుతం షిఫ్ట్‌ల వారీగా 11 ఏజెన్సీల సిబ్బంది రెస్క్యూ టీమ్స్‌ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇవాళ.. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ కంపెనీ బృందంతోపాటు.. 110 మంది రెస్క్యూ సిబ్బంది కూడా టన్నెల్ లోకి వెళ్లారు.. అక్కడ పరిస్థితులను బట్టి తవ్వకాలు జరుపుతున్నారు.

కాగా.. ఎస్ఎల్‌బీసీ సొరంగం లోపల నీరు, బురదతో సహా పరిస్థితులు సవాలుగా మారడంతో, రెస్క్యూ సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి తెలంగాణ ప్రభుత్వం రోబోలను మోహరించాలని నిర్ణయించింది .హైదరాబాద్‌కు చెందిన ఈ ప్రైవేట్ కంపెనీ రోబో నిపుణుల సేవలను ఉపయోగించి ఈ ఆపరేషన్ చేపట్టడానికి ప్రభుత్వం నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్చి 8న తెలిపారు.

మరోవైపు దేశం నలుమూల నుంచి వచ్చిన నిపుణుల సలహాలు, సూచనలు తీసుకొని.. అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. అయినా ఆశించిన స్థాయిలో ఫలితం దక్కడం లేదు. టన్నెల్ లోపలికి వెళ్లే పరిస్థితులు అనుకూలంగా లేవు. దీంతో రోబోలను వినియోగిస్తున్నారు.. రాళ్లు, మట్టి, నీళ్లలో టీబీఎం శకలాలు కూరుకుపోవడంతో రెస్క్యూ సిబ్బంది ప్రమాదాల బారిన పడకుండా రోబోలను తీసుకొచ్చారు..

మరోవైపు టన్నెల్‌లో మినీ జేసీబీలతో శిథిలాలు తొలగిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగా.. టన్నెల్ ఎండ్ పాయింట్ సమీపంలో TBM మిషన్ ముందు భాగం పూర్తిగా బురదలో కూరుకుపోయింది. అలానే TBM మిషన్ వెనుకభాగం శకలాల తొలగింపు వేగంగా సాగుతుండగా.. రెండు మినీ ప్రొక్లెయిన్స్ ఉపయోగించి రెస్క్యూ టీం శకలాలు తొలగిస్తున్నారు. జీరో పాయింట్ వద్ద చివరి 50 మీటర్లు సంక్లిష్టంగా ఉందని సిబ్బంది చెబుతున్నారు. ఇందుకోసమే రోబోలను వినియోగిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification