స్కిన్ కేర్ అంటే ముందుగా అందరూ దృష్టిపెట్టేది ముఖంపైనే. ఎదుటివారు చూసేందుకు ఫ్రెష్‌గా, అందంగా కనిపించాలనే తాపత్రయంతో పదే పదే ఫేస్ వాష్ చేయడం చాలామందికి అలవాటు. ఇందుకోసం ఇప్పుడు అంతా ఎక్కడకు వెళ్లినా ఫేస్ వాష్ లిక్విడ్ తమ వెంట తప్పకుండా తీసుకెళుతున్నారు. తాజా అనుభూతి కోసం వారికి తెలియకుండానే మాటిమాటికీ ముఖం కడగటం లాంటివి చేస్తుంటారు. ఇలా చేస్తేనే చర్మం శుభ్రంగా ఉంటుందనే అభిప్రాయం తప్పని సూచిస్తున్నారు చర్మసంరక్షణ నిపుణులు. రోజుకు ఎన్నిసార్లు ముఖం కడిగాం అనే దాని కంటే ఎప్పుడు కడుగుతున్నాం అనేదే ముఖ్యమని అంటున్నారు.
ముఖం సరైన సమయంలో కడుక్కోకపోతే స్కిన్ కేర్ కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ వృథానే అవుతాయి. అలా అని ఎక్కువ సార్లు కడిగినా ప్రమాదమే. చర్మాన్ని సంరక్షించేందుకు సహజంగానే సీబమ్ అనే నూనె పదార్థం ఉంటుంది. ఇలా మాటిమాటికి ఫేస్ వాష్ చేయడం వల్ల చర్మం జీవం కోల్పోయి కాంతివిహీనంగా మారడమే కాదు. చర్మ పొడిబారిపోయి బయటి వాతావరణంలో ఉన్న దుమ్మూ ధూళికి, బాక్టీరియాకు త్వరగా ప్రభావితమవుతుంది. చర్మంపై పేరుకుపోయిన మలినాలు పోవాలనే ఉద్దేశంతో మనం చేసే చర్యలు చివరికి చర్మసంబంధిత సమస్యలు తెచ్చిపెడతాయి.
రోజుకు ఎన్ని సార్లు ముఖం కడుక్కోవాలి?
సాధారణంగా ఏ చర్మతత్వం ఉన్నవారైనా సరే రోజుకు రెండుసార్లకు మించకుండా మీ ముఖాన్ని కడగాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఒకసారి, రాత్రి పడుకునే ముందు మరోసారి తప్పక శుభ్రపరచుకోవాలి. సాధారణ చర్మం, జిడ్డు చర్మం లేదా మొటిమల సమస్యలతో బాధపడేవారు అవసరాన్ని బట్టి 2 సార్లకు మించి ముఖాన్ని శుభ్రపరచుకోవచ్చు. ఇందుకు రసాయనాల గాఢత ఎక్కువగా లేని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి. పొడి చర్మం లేదా సున్నిత చర్మం ఉన్నవారు రోజూ రాత్రిపూట తప్పనిసరిగా ఫేస్ వాష్ చేసుకోవాలి. అవసరమైతే తప్ప రెండుసార్లు ముఖం శుభ్రపరచుకోవడం ఈ తరహా చర్మతత్వం ఉన్నవారికి అంత మంచిది కాదు. మేకప్ వేసుకోవడం, పనిచేసే ప్రదేశంలో చెమట ఎక్కువగా పట్టడం, పొల్యూషన్‌లో ఎక్కువగా తిరిగేవారు, చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారు ముఖం మురికిగా, జిడ్డుగా మారిన వెంటనే ముఖం కడగాలి. ఇలాంటి సందర్భాల్లో 2 సార్లకు మించి ఫేస్ వాష్ చేసుకోవడమే ఉత్తమం.
ముఖం కడుక్కునేటపుడు గుర్తుంచుకోవలసిన విషయాలు..
1. గోరువెచ్చని నీటిని వాడండి : మరీ వేడిగా ఉన్న నీటితో ముఖం కడగవద్దు. ఇది మీ చర్మంలోని సహజ నూనెలను తొలగిస్తుంది.
2. సున్నితమైన క్లెన్సర్‌ని ఎంచుకోండి : మీరు వాడుతున్న క్లెన్సర్ మీ చర్మ రకాన్ని బట్టి ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించండి. క్లెన్సర్ మీ చర్మ రకాన్ని బట్టి లేకపోతే, అది మీ ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేయదు.
3. ముఖాన్ని మసాజ్ చేయండి : మురికి, మలినాలను పూర్తిగా తొలగిపోవాలంటే ముఖం కడుక్కునే సమయంలో సున్నితంగా మసాజ్ చేయండి.
4. గట్టిగా రుద్దవద్దు : మీ ముఖాన్ని గట్టిగా రుద్దడానికి బదులుగా శుభ్రమైన టవల్‌తో మెల్లగా తుడవండి.
5. మాయిశ్చరైజ్ : మీ ముఖాన్ని కడిగిన తర్వాత ముఖం కడిగిన తర్వాత, టోనర్, మాయిశ్చరైజర్ రాయండి. టోనర్ అప్లై చేయకపోయినా, మాయిశ్చరైజర్ రాయడం చాలా ముఖ్యం. ఇది హైడ్రేషన్‌ను లాక్ చేసి మీ చర్మాన్ని కాపాడుతుంది.