సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన అపశృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టికెట్ల కోసం వేచి ఉన్న భక్తులపై గోడ కూలి మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారీ వర్షాల కారణంగా ఊహించని ప్రమాదం జరిగిందని, పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడినట్లు చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నానని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా వెల్లడించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
సింహాచలం ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, మంత్రులు ఆనం, డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపి భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం వివరాలు తెలుసుకున్నారు.
గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు సీఎం ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం.. గాయపడిన వారికి రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి
విశాఖ సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలోని రూ.300 టికెట్ క్యూలైన్‌పై గోడ కూలి ఎనిమిది మంది భక్తులు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సింహగిరి బస్టాండ్ నుంచి పైకి వెళ్లే రూట్లో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర గోడ కూలింది. 300 రూపాయల క్యూలైన్లో మెట్లు ఎక్కుతుండగా భారీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..