యూనివర్సిటీ పాలక మండళ్లు ఖాళీ
మార్చి 22తో ముగిసిన పదవీకాలం
ఇప్పటికీ ఖరారు కాని కొత్త పేర్లు
అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం (Andhra Pradesh)లోని అత్యధిక విశ్వవిద్యాలయాల్లో పాలన ఎక్స్ అఫీషియో సభ్యుల చేతుల్లోకి పూర్తిగా వెళ్లిపోయింది. కొన్ని యూనివర్సిటీల్లో అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని కనిష్ఠ స్థాయిలో పాలక మండళ్లలో సభ్యుల సంఖ్య ఉంది. దీంతో ఆయా ఉన్నత విద్యా సంస్థల్లో కీలక నిర్ణయాలను ఏమాత్రం తీసుకోలేని పరిస్థితుల్లోకి పాలనాయంత్రాంగం జారిపోయింది. అటు యూనివర్సిటీల ఉన్నతాధికారులకు, ఇటు ఉన్నత విద్యా మండలికి విశ్వవిద్యాలయాల అభివృద్ధి, ఉన్నత విద్యపై ఎలాంటి ఆసక్తి లేకపోవడమే ఈ మొత్తానికి ప్రధాన కారణమన్న విమర్శ వినిపిస్తోంది.
మార్చి 22తో ముగిసిన పదవీకాలం
యూనివర్సిటీ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్/పాలక మండలి(ఈసీ)లో ఎక్స్ అఫీషియో, నియమిత సభ్యులు… కలిపి మొత్తం 15 మంది ఉంటారు. ఈసీకి ఉపకులపతి చైర్మన్‌గా ఉంటారు. రిజిస్ర్టార్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. రెక్టార్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నత విద్యామండలి చైర్మన్, ఆర్థిక శాఖ నుంచి ఒక ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. మిగిలిన తొమ్మిది మందిని ఆయా యూనివర్సిటీలు ప్రతిపాదిస్తే… ప్రభుత్వం నియమిస్తుంది. రాష్ట్రంలోని 14 విశ్వవిద్యాలయాల్లో 2020 మార్చి 23న సభ్యులను నియమిస్తూ వైసీపీ సర్కారు (YCP Government) ఉత్తర్వులు జారీ చేసింది. వారి పదవీ కాలం ఈనెల 22తో ముగిసింది. రెండు నెలల ముందే… జనవరిలో ఉన్నత విద్యామండలి కొత్త సభ్యుల నియమాకానికి పేర్లు ప్రతిపాదించాలని లేఖలు రాసింది. కొన్నింటి నుంచి ప్రతిపాదనలు వచ్చినా, కొన్ని సంస్థలు స్పందించలేదని సమాచారం. లేఖ రాయడంతో బాధ్యత తీరిపోయిందన్నట్లు వ్యవహరించిన ఉన్నత విద్యామండలి కీలకమైన ఈ అంశంపై ఆ తరువాత ఏమాత్రం పట్టించుకోలేదు. జేఎన్‌టీయూ కాకినాడ, అనంతపురం, శ్రీ వెంకటేశ్వర, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ద్రవిడియన్, యోగి వేమన, ఆచార్య నాగార్జున, ఆంధ్ర, ఆదికవి నన్నయ, రాయలసీమ, బీఆర్ అంబేద్కర్, శ్రీకృష్ణ దేవరాయ, విక్రమ సింహపురి, కృష్ణా విశ్వవిద్యాలు… అంటే మొత్తం 18 యూనివర్సిటీల్లో కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగింటిని మినహాయిస్తే మిగిలిన పధ్నాలుగింటిలోనూ ఇదే పరిస్థితి.
ఈసీలు లేకుంటే…
యూనివర్సిటీల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పాలక మండలి తీర్మానం తప్పనిసరి. కొత్త విద్యా సంవత్సరం రాబోతున్న తరుణంలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలన్నా, సిలబ్‌సలో మార్పులు చేయాలన్నా ఈసీ ఆమోదం ఉండాలి. ఈసీ లేకపోతే ఏళ్ల తరబడి నడిచే రోజువారీ కార్యక్రమాలు మినహా మరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి విశ్వవిద్యాలయాలు చేరుకుంటాయి.
సభ్యులుగా ఎవరెవరిని నియమిస్తారు?
సాంకేతికంగా సభ్యుల నియామకాలకు యూనివర్సిటీ పేర్లు ప్రతిపాదిస్తుంది. యూనివర్సిటీ కాలేజీల నుంచి సీనియర్ ప్రొఫెసర్, యూనివర్సిటీ కాలేజీ, అఫిలియేటెడ్ ప్రభుత్వ కళాశాల నుంచి ఒక్కో ప్రిన్సిపాల్, అలాగే ఒక్కో అధ్యాపకుని పేర్లను ప్రతిపాదించాలి. వీరితోపాటు పారిశ్రామిక, వ్యవసాయం, వాణిజ్యం, విద్య, న్యాయ వృత్తి, సామాజిక సేవా రంగాలకు చెందిన నలుగురు ప్రముఖుల పేర్లనూ సూచించాలి. వాటిని ప్రభుత్వం పరిశీలించి నియమిస్తుంది. ఈ ప్రక్రియ కొన్ని విశ్వవిద్యాలయాలకు ప్రారంభ దశలో ఉంటే మరికొన్నింటిలో ఇంకా ప్రారంభమే కాలేదు. దీంతో ఈసీ సభ్యుల నియామక ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి.
కనీస కోరం లేని సంస్థలూ ఉన్నాయి
ఈసీ సమావేశమై నిర్ణయాలు తీసుకోవాలంటే మొత్తం సభ్యులు 15 మందిలో కనీసం ఆరుగురు ఉండాలి. అప్పడే కోరం ఉన్నట్లు. నియమిత సభ్యులు లేకుండా ఎక్స్ అఫీషియో సభ్యులు సంపూర్ణంగా ఉన్నా కోరం ఉండేది. బీఆర్ అంబేద్కర్, ఆదికవి నన్నయ, విక్రమ సింహపురి, యోగి వేమన, ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలకు రెక్టార్లు లేరు. దీంతో వీటిలో అసలు ఈసీ సమావేశాన్ని కూడా పెట్టలేని దుస్థితి.
నచ్చిన నిర్ణయాలు తీసుకోవచ్చు..!
ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల నియామకాల్లో జాప్యానికి కారణం పూర్తిగా ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే అన్న విమర్శలు బలంగానే ఉన్నాయి. ఈసీ సమావేశాలపై పెత్తనం చేయాలని ప్రయత్నిస్తున్న కొందరు అధికారులే ఈ ఆలస్యానికి కారణమన్న ఆరోపణలు యూనివర్సిటీ అధికారుల నుంచి వినిపిస్తున్నాయి. ఎక్స్ అఫీషియో సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తే తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవచ్చన్న స్వార్థపూరిత ఆలోచనే దీనికి కారణమని వారు ఆరోపిస్తున్నారు.
Updated Date – 2023-03-27T14:20:58+05:30 IST