School fees: దేవుడా.. ఈ ఫీజులెలా కట్టాలి నాయనా..

Written by RAJU

Published on:

– బడి ఫీజుల మోతపై తల్లిదండ్రుల ఆందోళన

– అనుమతి లేని స్కూళ్లలోనూ ఇష్టారాజ్యంగా ఫీజులు, డొనేషన్ల వసూలు

బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ పాఠశాలల(Private schools) ఫీజులపై తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. పిల్లలకు మంచి విద్యాబుద్దులు నేర్పే పాఠశాలల్లో చదివించాలని ప్రతి తల్లిదండ్రులూ ఆశిస్తారు. వారు బాగా చదివి ఉన్న స్థాయిలో ఉండాలని కలలు కంటారు. తల్లిదండ్రుల ఆశలను కొన్ని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. పిల్లలకు పాఠశాలల్లో సరైన వసతులు ఉండడం లేదు. కనీస విద్యార్హతలు లేనివారిని కూడా ఉపాధ్యాయులుగా నియమిస్తున్నారు. కనీసం ఇంటర్‌ పాస్‌ కాని వాళ్లు కూడా ప్రైవేటు పాఠశాలల్లో పాఠాలు చెబుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బళ్లారి, విజయనగర, రాయచూరు, కొప్పళ, తదితర జిల్లాల్లో 1 నుంచి 10వ తరగతి వరకూ చదువు చెప్పే ప్రైవేటు పాఠశాలలు సుమారు 1600కు పైగానే ఉంటాయని అంచనా. 1 నుంచి 10వ తరగతి వరకు పాఠశాల నిర్వహణకు డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఇన్‌స్ట్రక్షన్‌ (డీడీపీఐ) అనుమతి ఇస్తారు. బళ్లారి, విజయనగర(Bellary, Vijayanagara), రాయచూరు కొప్పళ జిల్లాలకు డీడీపీఐ కార్యాలయం రాయచూరు కేంద్రంగా ఉంది. ఒక పాఠశాల నిర్వహణకు అనుమతులు ఇవ్వాలంటే డీడీపీఐ పాఠశాలలు నేరుగా పరిశీలించి అనుమతులు ఇవ్వాలి. పాఠశాలలు పిల్లలు కూర్చోవడానికి అనుకూలంగా గదులు ఉన్నాయా లేదా.? ఆట స్థలాలు, తాగునీరు, రక్షణకు కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనే అంశాలు పరిశీలించి పాఠశాల నిర్వహణకు అనుమతులు ఇవ్వాలి. అలాంటివి ఏమీ పరిశీలించకుండానే అనుమతులు ఇస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. చాలా పాఠశాలల్లో విపరీతంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎన్‌కేజీ, యూకేజీకి కూడా పుస్తకాలు, డ్రస్సులు, బూట్లు, సాక్సులు, డ్రాయింగ్‌ పేపర్లు ఇలా అనేక విధాలుగా రూ. 15 నుంచి రూ.25 వేల వరకూ ఫీజులు గుంజుతున్నారు.

ఇక డొనేషన్లు మాట ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. స్కూల్‌ స్థాయిని బట్టి రూ. లక్షల్లో లాగుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బళ్లారి నగరంలో ఉండే కొన్ని ప్ర్తెవేటు పాఠశాలలు మితిమీరిన డోనేషన్లు, ఫీజులు వసూలు చేస్తున్నారని మల్లికార్జున(Mallikarjuna) అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలో యూజర్‌ ఫీజులని, ఎగ్జామ్‌ పేపర్‌ ఫీజులు అని ఇలా అనేక రకాలుగా వసూళ్లు చేస్తున్నారని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. తీరా ఏడాది గడిచాక పిల్లలు చదువు విషయం చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటుందని వాపోతున్నారు. మొత్తం మీద పాఠశాలల్లో పిల్లల చదువు పేరుతో ఫీజులు వేలకు వేలు గుంజడంతో పాటు కనీసం సౌకర్యాలు కూడా లేవని తెలుస్తోంది. సంబందింత అఽధికారులు ఇలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Subscribe for notification