-
కూటమి ముసుగులో ఇసుక మాఫియా
-
లిక్కర్, గ్రావెల్, మెటల్, మట్టి …అన్నింటా దోపిడే
-
డ్రెడ్జింగ్ ద్వారా కూడా ఇసుక తవ్వకాలు
-
ఓపెన్ రీచ్‌ల్లో సొంత సామ్రాజ్యాలు
-
రోజుకు రూ. 15 లక్షల మామూళ్లు
-
బోట్స్‌మన్ సొసైటీల నుంచి టన్ను లెక్కన దందా
-
డిపాజిట్లు వసూలు చేసి బెల్టు షాపులు
-
చోటా నేతలే చెలరేగుతున్న వైనం
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
‘ఇసుక మాదే. మట్టీ మాదే… మద్యం నాదే. పేకాట క్లబ్బులూ మావే!’… తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడి దందా ఇది! ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెద్ద పెద్ద నాయకులన్నప్పటికీ… ఈ చోటా నేతదే హవా! అధికారులు ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తున్నా… ఆ నాయకుడు చెలరేగిపోతూనే ఉన్నాడు. ఆయనతోపాటు మరికొందరు నేతలూ ఎవరికి వారుగా సంపాదనలో పడ్డారు.
రాజమహేంద్రవరంలోని కొందరు నేతలతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను తోడేస్తున్నారు. వంతెనల పక్కనే పడవలతో ఇసుకను తవ్వుతున్నారు. రెండు రోజుల కిందట బల్లిపాడులో మైన్స్, రెవెన్యూ అధికారులు స్వయంగా డ్రెడ్జింగ్ మిషన్‌ను పట్టుకుని స్వాధీనం చేసుకుని కేసు పెట్టారు. వంతెనలను ఆనుకుని ఇసుక తోడుతున్న పడవలను పోలీసు అధికారులు పలుమార్లు సీజ్ చేశారు.
రాష్ట్రంలోనే అతి పెద్ద నది గోదావరి! అందునా… తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద కిలోమీటర్ల వెడల్పునా విస్తరించి ఉంటుంది! అక్కడే… లెక్కలేనంత ఇసుక! అధికారంలో ఎవరున్నా… ఆ ఇసుకపైనే కన్ను. వైసీపీ హయాంలో… ఇసుక ‘కలెక్షన్ల’ ఒత్తిడికి తట్టుకోలేక అదే పార్టీకి చెందిన ఓ ఇసుక వ్యాపారి రైలు పట్టాలపై తల పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డారు. వైసీపీ పోయిన తర్వాత పరిస్థితులు మారతాయని ప్రజలు భావించారు.
కానీ… అధికార కూటమిలో నేతలుగా చలామణీ అవుతున్న కొందరు డబ్బు సంపాదనే ధ్యేయంగా చెలరేగిపోతున్నారు. ర్యాంపులు, బోట్స్‌మన్ సొసైటీల పాలిట ‘కంఠ’కులుగా తయారయ్యారు. గట్లు, నదుల గర్భాలు… వేటినీ వదలకుండా తవ్వేస్తున్నారు. ఇసుక, లిక్కర్, గ్రావెల్, రోడ్డు మెటల్, లంక మట్టి.. ఇలా అన్నింటా దోపిడీకి తెగబడుతున్నారు. చివరకు పేకాట క్లబ్‌లు కూడా నిర్వహిస్తున్నారు. అధికారులు నోటీసులు ఇస్తున్నా, కేసులు పెడుతున్నా మాఫియా దందా మాత్రం ఆగడం లేదు. ఒక నాయకుడు కొవ్వూరు కంఠకుడిగా మారిపోగా… మరికొందరు సొంత దుకాణాలు తెరిచేశారు. దీంతో వారి మధ్య వర్గ పోరు కూడా మొదలైంది. ఎమ్మెల్యేతోపాటు ఇతర ముఖ్య నేతలు నామమాత్రంగా మిగిలిపోగా… చోటా నాయకులే నియోజకవర్గాన్ని దున్నేస్తున్నారు.
డ్రెడ్జింగ్‌తోనూ దోపిడీ…
కొవ్వూరు నియోజకవర్గంలో బోట్స్‌మన్ సొసైటీల ముసుగులోనే దోపిడీ జరుగుతోంది. డిసెంబరు నెలలో సొసైటీలకు అవకాశం ఇచ్చినప్పుడు కేవలం వాడపల్లి ర్యాంపు నుంచే రోజుకు సుమారు 400 లారీల ఇసుక రవాణా సాగేది. ఆరు యూనిట్ల లారీ ఇసుకకు రూ.ఆరు వేలు సొసైటీ వసూలు చేస్తే… అందులో చిన్న లారీకి రూ.500, పెద్ద లారీకి రూ.వెయ్యి, మార్కెట్ లారీకి రూ.రెండు వేలు కప్పం కట్టాల్సిందే. జనవరిలో ఈ పాలసీ మార్చి టన్నుకు రూ.50 వంతున మామూళ్లు తీసుకోవడం మొదలుపెట్టారు. అది చాలదని, అదనపు లోడుకు వచ్చే మొత్తం సొమ్మునూ లాగేస్తున్నారు. దీనికోసం కొందరిని గుమస్తాలుగా వారికి ఓ స్కానర్ ఇచ్చి, దానికి నేరుగా డబ్బు జమ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకు రూ.15 లక్షలకు పైగానే వసూలు చేస్తున్నారు. వాడపల్లి నుంచి తాడిపూడి వరకు సదరు నేతలు చెప్పిందే రేటు! నిజానికి, నిర్ణీత ధర ప్రకారం టన్ను ఇసుక రూ.88కి అమ్మాలి. ఇక్కడ ర్యాంపు పాడుకున్న ఓ అధికార పార్టీ నేత రూ.255కు అమ్ముతున్నాడు.తాళ్లపూడి మండలం బల్లిపాడు, వేగేశ్వరపురం, కొవ్వూరు మండలం కుమారదేవం-1,2 ర్యాంపుల్లోనూ ఇదే వరుస.
బెల్ట్ షాపునకు రూ.50వేలు డిపాజిట్
కొవ్వూరు నియోజకవర్గంలో సుమారు 40 వరకూ బెల్ట్‌షాపులు ఉన్నట్టు సమాచారం. ఒక్కో బెల్ట్ షాపునకు డిపాజిట్‌గా రూ.50 వేలు సదరు నేతలు వసూలు చేశారు. గత ప్రభుత్వంలో వీరంతా అప్పటి అధికార పార్టీతో అంటకాగినట్టు ఆరోపణలు ఉన్నాయి. నాడు మునిపిపల్ ఎన్నికల్లో వైసీపీకి సహకరించారన్న విమర్శలు వచ్చాయి.
ఎస్సీ భూములనూ వదల్లేదు..
కొవ్వూరు మండలంలోని చిడిపి, కుమారదేవం గ్రామాలకు చెందిన 97 మంది ఎస్సీలకు 65 సెంట్ల చొప్పున గతంలో ప్రభుత్వాలు లంక భూములు ఇచ్చాయి. వీటిపై కూడా మాఫియా కన్నుపడింది. ఇటీవల గోదావరి నదికి అడ్డంగా మట్టి రహదారి నిర్మించి రాత్రింబవళ్లూ వందలాది లారీల మట్టిని తరలించారు. లారీ మట్టి రూ.6 వేల వంతున అమ్మేశారు. ఈ మట్టి ఇటుక బట్టీలకు, కడియం నర్సరీలకు తరలిపోతోంది. ఇంకా లే అవుట్ల ఫిల్లింగ్, పల్లపు ప్రాంతాలు మెరక చేసుకోవడం కోసం ఈ మట్టిని అమ్ముతున్నారు. దీనిని స్థానికులు అడ్డుకోవడంతో పాటు అధికారులు కూడా స్పందించడంతో ప్రస్తుతం ఇక్కడ తవ్వకాలు ఆగాయి. కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు కొవ్వూరు తహశీల్దార్ ఆర్‌ఐ, వీఆర్వో, సీనియర్ అసిస్టెంట్, వీఆర్‌ఏలతో టీమ్‌లు వేసి ప్రతిరోజు రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకూ పహారా పెట్టి తవ్వకాలకు బ్రేకులు వేశారు.