Sand Delivery: ఇసుక డోర్‌ డెలివరీ!

Written by RAJU

Published on:

ఇందుకోసం ఇసుక క్వారీల్లాగే లారీ ఏజెన్సీలకు టెండర్లు.. బుకింగ్‌కు కోసం యాప్‌.. రూపొందిస్తున్న టీజీఎండీసీ

  • ఎంత ఇసుక ఎక్కడికి కావాలో డీటెయిల్స్‌ ఇస్తే డెలివరీ

  • చెల్లింపులంతా ఆన్‌లైన్‌లోనే.. దీంతో అక్రమాలకు చెక్‌

  • రెండు వారాల్లో తెలంగాణలో కొత్త ఇసుక పాలసీ అమలు!

  • నెల రోజులుగా ఇసుక క్వారీలపై ప్రభుత్వం దాడులు

  • అక్రమాలకు అడ్డుకట్ట పడటంతో కృత్రిమంగా ఇసుక

  • కొరతను సృష్టిస్తున్న ఇసుకాసురులు..

  • ఒక్క నెలలోనే టన్నుకు 600 రేటు పెంపు

వరంగల్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కృత్రిమంగా ఇసుకకు కొరత సృష్టించడం, ఆ తర్వాత రేట్లు పెంచి అమ్ముకోవడం, నకిలీ వే బిల్లులు, నంబర్‌ ప్లేట్లు మార్చి ఇసుక రవాణా.. తదితర అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తీసుకురావాలని యోచిస్తోంది. ఇసుకను డోర్‌ డెలివరీ చేయడానికి గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది. ఇసుక క్వారీల టెండర్‌ తరహలోనే ఇసుక సరఫరాను కూడా టెండర్‌ ద్వారా ఏజెన్సీలకు ఇచ్చి, ఆ ఏజెన్సీల ద్వారా బుకింగ్‌ చేసుకున్న వినియోగదారుడి ఇంటికి ఇసుకను సరఫరా చేస్తే ఎలా ఉంటుందనేదానిపై కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ప్రధానంగా గోదావరి, మానేరు నదుల తీరాల నుంచి ఇసుక భారీగా లభ్యమవుతోంది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 186 స్టాక్‌ పాయింట్లను ఏర్పాటు చేసి 1.50 కోట్ల టన్నుల ఇసుకను విక్రయించింది. దీని ద్వారా రూ.564 కోట్ల అదాయం సమాకూరింది. జీఎస్టీ, రోడ్డు డ్యామేజీ సర్వీసు చార్జీల ద్వారా ప్రభుత్వానికి మరో రూ.29కోట్ల అదాయం వచ్చింది. ఇసుక రవాణాలో అక్రమాలను అరికడితే ఈ ఆదాయం మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో మొత్తం 21 ఇసుక క్వారీలు నడుస్తున్నాయి. మరో 10 క్వారీల్లో ఇసుక నిల్వలున్నా ఆన్‌లైన్‌ బుకింగ్‌ లేకపోవటంతో ఇసుక అమ్మకాలను నిలిపి వేశారు. ఇంకా 15 ఇసుక క్వారీలు కొత్తగా ప్రారంభించాల్సి ఉంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా ఇసుక క్వారీలను టీజీఎండీసీ గుర్తించింది. కొత్త ఇసుక పాలసీని తీసుకురానున్న క్రమంలో కొత్త క్వారీలకు కూడా అనుమతి ఇస్తే ఏటా రూ.వెయ్యి కోట్ల అదాయం ప్రభుత్వానికి చేరుతుందని అంచనా. రెండు వారాల్లో కొత్త ఇసుక పాలసీని ప్రభుత్వం ప్రకటిస్తుందని సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా 50వేల ఇసుక లారీలు

రాష్ట్రవ్యాప్తంగా 50వేలకు ఇసుక లారీలు పైగా ఉన్నాయి. వీటిపై ప్రభుత్వ నియంత్రణ లేదు. దీంతో ఇసుక అక్రమ దందాను అరికట్టడం సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. ఇసుక సరఫరా టెండర్లను లారీ ఏజెన్సీలకు అప్పగించనున్నారు. మరోవైపు, టీజీఎండీసీ ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. వినియోగదారులు తమకు ఎంత ఇసుక కావాలి.. ఎక్కడికి కావాలి.. అన్న వివరాలను ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇసుకకు, దాని రవాణాకు అయ్యే ఖర్చు(దూరాన్ని బట్టి చార్జీలు మారతాయి) ఆన్‌లైన్‌లోనే టీజీఎండీసీకి చెల్లించేలా ఈ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఉదాహరణకు 14టైర్ల లారీలో 32టన్నుల ఇసుకకు రూ.13,056 వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది. వరంగల్‌ వరకు ఇసుకను తీసుకెళ్లేందుకు 14టైర్ల లారీ అద్దె ఎంత ఉంటే అంతా మొత్తాన్ని కూడా ఆన్‌లైన్‌లో చెల్లిస్తారు. తర్వాత లారీ ఏజెన్సీకి సమాచారం ఇచ్చి, అర్డర్‌ చేసిన వినియోగదారుడి ఇంటికి ఇసుకను సరఫరా చేస్తే ఎలాంటి అక్రమాలకు ఆస్కారం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఇసుక సరఫరాకు ఇంకా మెరుగైన ప్రణాళికలు ఉంటే సూచించాలని కూడా ప్రభుత్వం అధికారులను కోరినట్లు తెలిసింది.

అదనపు బకెట్‌, నంబర్‌ ప్లేట్ల మార్పు.. ఇలా ఎన్నో అక్రమాలు

గత ప్రభుత్వం హయాంలో ఇసుక పాలసీ అక్రమార్కులకు కాసులు కురిపించింది. స్థానిక చోటా నేతలు, కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి వరకు మామూళ్లు భారీగా చేతులు మారటంతో అంతా చూసీ చూడనట్లుగానే వ్యవహారం సాగిందనే ఆరోపణలున్నాయి. ఇసుక టెండర్‌దారులు కొన్ని చోట్ల లారీ యాజమానుల నుంచి లోడింగ్‌ చార్జీ పేరుతో ప్రతీ లారీకి రూ.2,500 వరకు వసూలు చేశారు. అలాగే 10 టైర్ల లారీలో 19.5టన్నులు, 12టైర్ల లారీలో 26 టన్నులు, 14టైర్ల లారీలో 32టన్నుల ఇసుక తరలించాల్సి ఉండగా, అదనపు బకెట్‌ పేరుతో ప్రతీ లారీలో ఐదారు టన్నుల ఇసుకను అదనంగా నింపారు. ఈ అదనపు బకెట్‌కు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేశారు. అలాగే లారీల నెంబర్‌ ప్లేట్లు మార్చటం, నకిలీ వే బిల్లులతో వందలాది లారీల్లో ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారు. ఇసుక క్వారీల్లో జరుగుతున్న అక్రమాలను గత ఏడాది కాలంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం గుర్తించింది. అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు ప్రారంభించింది.

నెల రోజుల్లో టన్నుకు రూ.600పెంపు

రెండు మూడు నెలలుగా రాష్ట్రంలో ఇసుకకు డిమాండ్‌ బాగా పెరిగింది. మరోవైపు, ఇసుక క్వారీలపై ప్రభుత్వం దాడులు నిర్వహిస్తుండటంతో పాత పద్ధతిలో దోపిడీకి బ్రేకులు పడ్డాయి. దీంతో ఇసుకాసురులు ఇసుక ధరలను పెంచేశారు. ప్రభుత్వం టీజీఎండీసీ ద్వారా టన్ను ఇసుకను రూ.408కి అమ్ముతోంది. దీనికి రవాణా చార్జీలు అదనం. జనవరిలో వరంగల్‌, కరీంనగర్‌ లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో టన్ను ఇసుకను రూ.వెయ్యికి విక్రయించగా.. ఇప్పుడు రూ.1600కు పెంచారు. హైదరాబాద్‌లో రూ.1,600 నుంచి రూ.2,200కు పెంచారు. నెల రోజల వ్యవధిలోనే టన్నుకు సుమారుగా రూ.600కు పైగా ధరలు పెరగటంతో ఇళ్లు నిర్మించుకునే సామాన్యులపై ఆర్థికభారం పడుతోంది.

Updated Date – Mar 15 , 2025 | 04:10 AM

Subscribe for notification