ఐపీఎల్ మొదటి సీజన్ 2008లో మొదలైంది. అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ టోర్నమెంట్. ఇక ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో ఒకరైన సచిన్ టెండూల్కర్ ఈ టోర్నమెంట్‌లో పలు సీజన్లు ఆడిన సంగతి తెలిసిందే. మొదటి సీజన్‌లో సచిన్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత అతడు అదే ఫ్రాంచైజీతో 6 సంవత్సరాలు భాగమయ్యాడు. ఆపై 2013లో రిటైర్ అయ్యాడు. ఇక ఏప్రిల్ 24న సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా.. అతడి మొదటి ఐపీఎల్ జీతం, టోర్నమెంట్ ద్వారా వచ్చిన సంపాదన ఎన్ని కోట్లో ఇప్పుడు తెలుసుకుందామా..
సచిన్ మొదటి ఐపీఎల్ జీతం ఎంత?
ఐపీఎల్‌లో సచిన్ కోసం ఎప్పుడూ వేలం జరగలేదు. సచిన్ సహా 5 మంది దిగ్గజ ఆటగాళ్లను మార్క్యూ ప్లేయర్లుగా చేయడంతో.. వాళ్లంతా వేలంలో పాల్గొనలేదు. మార్క్యూ ప్లేయర్స్ అంటే.. వేలం కంటే ముందే ఫ్రాంచైజీ తన జట్టు కోసం ఒక ఆటగాడితో సంతకం చేయాల్సి వస్తుంది. మొదటి సీజన్‌లో సచిన్‌తో ముంబై ఇండియన్స్ జట్టు ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం అతడికి రూ.44.85 మిలియన్లు చెల్లించారు. అంటే ఐపీఎల్‌లో సచిన్ తొలి జీతం రూ.4 కోట్ల 48 లక్షల 50 వేలు.
6 సంవత్సరాలలో ఇన్ని కోట్లు..
సచిన్ 2008 నుంచి 2013 వరకు ఐపీఎల్‌లో పాల్గొన్నాడు. ఈ టోర్నమెంట్‌లో ఆడినంత కాలం ముంబై జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు. వేలంలో ఎప్పుడూ పాల్గొనలేదు. ముంబై ఇండియన్స్ ప్రతి సీజన్‌లో అతన్ని అట్టిపెట్టుకుంది. 2010 సీజన్ వరకు ముంబై సచిన్‌కు జీతం కింద రూ.4 కోట్ల 48 లక్షల 50 వేలు చెల్లించింది. ఈ విధంగా, సచిన్ మొదటి మూడు సీజన్లలో రూ.13 కోట్ల 45 లక్షల 50 వేలు సంపాదించాడు. దీని తర్వాత ముంబై ఫ్రాంచైజీ అతడి ఫీజును రూ. 8 కోట్ల 28 లక్షలకు పెంచింది. అంటే 2011 నుంచి 2013 వరకు సచిన్ రూ.24.84 కోట్లు సంపాదించాడు. ఈ విధంగా, తన 6 సంవత్సరాల ఐపీఎల్ కెరీర్‌లో, సచిన్ రూ.38 కోట్ల 29 లక్షల 50 వేలు సంపాదించాడు.
సచిన్ ఐపీఎల్ కెరీర్..
సచిన్ ముంబై ఇండియన్స్ తరఫున 6 సీజన్లలో 78 మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో, అతను 34.84 సగటుతో 119.82 స్ట్రైక్ రేట్‌తో 2334 పరుగులు చేశాడు. తన పేరిట 1 సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అలాగే ఈ 6 సీజన్లలో 29 సిక్సర్లు, 245 ఫోర్లు కొట్టాడు.