భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి, మానవాళికి సంభవించబోయే ముప్పుల గురించి కొంతమంది అంచనా వేస్తుంటారు. అలాంటి వారిలో నోస్ట్రాడమస్, ఒరాకిల్ ఆఫ్ డెల్ఫీ, బాబా వంగా ముందు వరుసలో ఉంటారు. వీరు చెప్పిన భవిష్యవాణిలో అనేక విషయాలు జరిగాయి, వాళ్లు చెప్పారంటే కచ్చితంగా జరుగుతాయని ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది నమ్ముతుంటారు. వీరి బాటలోనే ఓ మంగా ఆర్టిస్ట్ కూడా భవిష్యత్తు గురించి కచ్చితంగా అంచనా వేస్తూ గుర్తింపును సంపాదించుకున్నారు. ఆమె పేరు రియో టాట్సుకి. బ్లూ ఆర్చివ్ అనే గేమ్‌లో ఓ క్యారెక్టర్. భవిష్యత్తు గురించి ఈ క్యారెక్టర్‌కు కలలు వస్తుంటాయి. ఆశ్చర్యకరంగా అవి నిజం అవుతున్నాయి.
అందుకే ఈ మంగా ఆర్టిస్ట్‌ను జపనీస్ బాబా వంగా అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈ సంవత్సరం చివర్లో ఒక పెద్ద విపత్తు సంభవించనుందని రియో అంచనా వేసింది. 1980ల నుంచి ఆమె చెప్పింది చెప్పినట్లు జరుగుతోంది. 1991లో రాక్ బ్యాండ్ క్వీన్ ఫ్రెడ్డీ మెర్క్యురీ మరణం, 1995లో జపాన్‌లోని కోబ్‌లో వినాశకరమైన భూకంపం, 2011 తోహోకు భూకంపం, సునామీ, 2020లో కోవిడ్ మహమ్మారి ఇలా విపత్తులను ముందుగానే అంచనా వేసింది. అయితే.. 2025 చివర్లో కూడా ఒక భారీ విపత్తు సంభవిస్తుందని రియో అంచనా వేసింది. ఇప్పుడు 2025వ ఏడాదిలో మనం ఉండటంతో.. ఆమె చెప్పింది జరుగుతుందేమో అని చాలా మంది ఆందోళన చెందుతున్నారు.
ఇంతకీ 2025 ఏడాది చివరి గురించి రియో ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం.. 2025లో జపాన్, ఆసియాలోని కొన్ని ప్రాంతాలను మెగా సునామీ ముంచెత్తుతుందని అంచనా వేసింది. జపాన్‌కు దక్షిణంగా ఉన్న పసిఫిక్ మహాసముద్రం ‘మరుగుతున్నట్లు’, భారీ బుడగలు ఉపరితలంపైకి పైకి లేస్తున్నట్లు కల వచ్చినట్లు పేర్కొన్నారు. ఇది నీటి అడుగున అగ్నిపర్వత విస్ఫోటనం లేదా సముద్రపు అడుగుభాగంలో భారీ పేలుడును సూచిస్తుందని రియో చెప్పింది. దీని ఫలితం విపత్తు కావచ్చు, 2011లో వచ్చిన సునామీ కంటే మూడు రెట్లు పెద్ద సునామీ కావచ్చు. ఈ మెగా-సునామీ జపాన్ పసిఫిక్ తీరప్రాంతాన్ని నాశనం చేయగలదని, ఫిలిప్పీన్స్, తైవాన్, ఇండోనేషియా వంటి పొరుగు ప్రాంతాలను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. విపత్తు కేంద్రం జపాన్, తైవాన్, ఇండోనేషియా, ఉత్తర మరియానా దీవులను కలిపే వజ్రం ఆకారంలో ఉన్న ప్రాంతంలో ఎక్కడో ఉన్నట్లు చెప్పింది.
అలాగే రెండు డ్రాగన్ లాంటి ఆకారాలు భూకంప కేంద్రం వైపు కదులుతున్నట్లు కూడా కలలో చూసినట్లు వెల్లడించింది. ఆశ్చర్యకరంగా హవాయి దీవుల సమీపంలో డ్రాగన్ ఆకారపు నిర్మాణాలు ఉన్నట్లు మ్యాప్‌లు పరిశీలిస్తే కనిపిస్తోందంటూ స్థానికులు చెబుతున్నారు. దీంతో రియో చెప్పినట్లు మెగా సునామీ వస్తుందని చాలా మంది బలంగా విశ్వసిస్తున్నారు. అలాగే జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ వెంబడి ఉందని నిపుణులు అంగీకరిస్తున్నారు, ఈ ప్రాంతం తరచుగా మెగాథ్రస్ట్ భూకంపాలకు, భారీ సునామీలకు అవకాశం ఉన్న ప్రాంతం. జపాన్ దక్షిణ తీరంలో ఉన్న ఫాల్ట్ జోన్ నాంకై ట్రఫ్ అటువంటి ప్రాంతమే, ఇక్కడ మెగాథ్రస్ట్ భూకంపం సంభవిస్తే, అది టాట్సుకి ఊహించినట్లుగానే 30 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో సునామీని సృష్టించవచ్చని నిపుణులు అంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.