
పదవీవిరమణ తర్వాత సుఖమయ జీవితం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వయసు మళ్లిన తర్వాత కూడా కష్టపడాలని, ఆర్థికంగా ఇబ్బందులు పడాలని ఎవరూ కోరుకోరు. అయితే మీరు కోరుకున్న విధంగా పదవీవిరమణ తర్వాత ప్రశాతం జీవితం కావాలంటే దానికి ముందు నుంచే ప్రణాళిక అవసరం. ఒక ప్లాన్ ప్రకారం మీ రాబడిని జాగ్రత్తగా వినియోగించుకుంటూ ఖర్చులు, పొదుపు, పెట్టుబడులను నిర్వహించుకోవడం ద్వారా ఆ లక్ష్యాన్ని అందుకోవచ్చు. అయితే చాలా మందికి ముందు నుంచే ప్లాన్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. వారి కుటుంబ బాధ్యతలు, ఆర్థిక భారాలతో ప్రణాళిక ప్రకారం చేయడం కష్టమవ్వొచ్చు. మీరు అలాంటి ఆలోచనల్లో ఉంటే ఈ కథనం మీకోసమే.. కేవలం 10ఏళ్ల కాల వ్యవధిలో మీ రిటైర్ మెంట్ ప్లాన్ ను చేయొచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు. అంటే అయితే మీరు 40 ఏళ్ల వయసులో రిటైర్ మెంట్ ప్లాన్ ప్రారంభించి, 50 ఏళ్ల వయసుకు వచ్చేసరికి కావాల్సిన విధంగా జీవించడానికి అవసరమయ్యే నగదును కూడబెట్టవచ్చని చెబుతున్నారు. అయితే అందుకు మీ ఆదాయపు స్థాయి అంటే మీరు ఎంత సంపాదిస్తున్నారు.. పొదుపు ఎంత చేయగలరు.. పెట్టుబడి ఎంత పెట్టగలరు.. మీ జీవనశైలి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆ ఆర్థిక సూత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అవసరాలను అర్థం చేసుకోవడం..
మీరు 40ఏళ్లకు పదవీవిరమణ ప్రణాళికను ప్రారంభించి.. 50 ఏళ్లకు రిటైర్ కావాలనుకుంటే ముందుగా మీరు రిటైర్ మెంట్ తర్వాత ఎలాంటి జీవితం కావాలనుకుంటున్నారో గ్రహింపునకు రావాలి. మీ అవసరాలకు ఎంత ఖర్చు అవుతుందో లెక్క కట్టాలి. ఏడాదికి ఎంత మొత్తంలో అవసరమవుతుందో అంచనా వేసి ప్రణాళిక చేయాలి. ఇందులో గృహనిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, ప్రయాణ ఖర్చులు, రోజువారీ ఖర్చులను పరిగణనలోకి తీసుకోండి. సాధారణంగా మీకు మీ పదవీ విరమణకు ముందు ప్రస్తుతం సంపాదిస్తున్న ఆదాయంలో 70-80% అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎంత మొత్తం కావాలి..
పదవీవిరమణ తర్వాత మీరు సుఖమయ జీవనం గడపడానికి మీకు ఎంత మొత్తం కావాలో నిర్ణయించాలంటే దానికి ’25 టైమ్స్ రూల్’ని ఉపయోగించుకోవచ్చు. అంటే మీరు పదవీ విరమణ చేసే సమయానికి మీ వార్షిక పదవీ విరమణ ఖర్చులకు 25 రెట్లు ఆదా చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీ వార్షిక ఖర్చులు రూ.18 లక్షలుగా అంచనా వేస్తే.. దానికి 25 రెట్లు అంటే మీకు రూ.4.5 కోట్లు ఆదా కావాల్సి ఉంటుంది. అలాగే దీనిలో ద్రవ్యోల్బణాన్ని కూడా లెక్కించాల్సి ఉంటుంది. అంతే కనీసం 4 నుంచి 6శాతం అంచాన వేసుకొని, మీ ప్రస్తుత పొదుపులు, వాటి సంభావ్య వృద్ధిని చక్రవడ్డీతో అంచనా వేయాల్సి ఉంటుంది.
40ఏళ్ల వయసులో ఎంత సంపాదించాలి?
పదవీవిరమణ తర్వాత జీవితానికి ఎంత సంపాదించాలో లెక్క కట్టాం కాబట్టి.. దానిని మీరు 40 ఏళ్ల వయసు నుంచే ఎలా సంపాదించాలో ప్రణాళిక చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు మీరు చేయాల్సిన మొదటి విషయం పొదుపును పెంచడం. సాధారణంగా 15-20% పొదుపు చేయాలని నిపుణులు చెబుతారు కానీ.. పదేళ్లలో రిటైర్ మెంట్ ప్లాన్ కు 40-50% లేదా అంతకంటే ఎక్కువగా పొదుపు చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇతర మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
పెట్టుబడులు ఇలా ఉండాలి..
మీ సంపాదన నుంచి పొదుపు చేసిన మొత్తంలో కొంత మొత్తాన్ని వివిధ పథకాల్లో వైవిధ్యంగా పెట్టుబడులు పెట్టాలి. నష్టభయాన్ని తగ్గించడానికి, రాబడిని పెంచడానికి స్టాక్‌లు, బాండ్‌లు, ఇతర ఆస్తుల వంటి వివిధ ఆస్తి తరగతులలో మీ పెట్టుబడులను విస్తరించాల్సి ఉంటుంది. ఈక్విటీ మీకు వృద్ధిని అందిస్తుంది. అదే సమయంలో బాండ్‌లు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. అలాగే పన్ను ఆదా చేసుకోడానికి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) వంటి పదవీ విరమణ ఖాతాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇవే కాక మీరు 50 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసే ప్రణాళికను 40 ఏళ్ల వయసులో ప్రారంభిస్తే క్రమశిక్షణ కలిగిన జీవన విధానం చాలా అవసరం. పక్కా ప్రణాళిక ప్రకారం ఖర్చులను పరిమితం చేసుకోవాలి. అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించాలి. పొదుపులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. పెట్టుబడుల ఫోర్ట్ ఫోలియేను వైవిధ్యంతో అమలు చేస్తూ.. ఎప్పటికప్పుడు ఆర్థిక నిపుణుల సలహాలను పాటించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాన్ని అధిగమించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి