Reliance Industries File Earnings: రిలయన్స్‌ ఆదాయం రూ.10 లక్షల కోట్లు

Written by RAJU

Published on:

  • గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్థూల ఆదాయమిది.. ఈ ఘనత సాధించిన తొలి కంపెనీ

  • క్యూ4 లాభం రూ.19,407 కోట్లు

  • రెవెన్యూ రూ.2.64 లక్షల కోట్లు

  • ఒక్కో షేరుకు రూ.5.5 డివిడెండ్‌

  • రూ.25,000 కోట్ల సమీకరణ

ముంబై: దేశీయ ప్రైవేట్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి. మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (క్యూ4)లో ఆర్‌ఐఎల్‌ ఏకీకృత నికర లాభం రూ.19,407 కోట్లకు (ఒక్కో షేరుకు రూ.14.34) చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇదే కాలానికి నమోదైన రూ.18,951 కోట్ల (ఒక్కో షేరుకు రూ.14) లాభంతో పోలిస్తే 2.4 శాతం పెరిగింది. 2024-25లోనే డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ఆర్జించిన రూ.18,540 కోట్ల లాభంతో పోల్చినా మెరుగైన వృద్ధిని నమోదు చేసింది.

ఆయిల్‌ అండ్‌ కెమికల్స్‌ (ఓ2సీ) వ్యాపార పనితీరు బలహీనంగానే ఉన్నప్పటికీ రిలయన్స్‌ జియో, రిటైల్‌ వ్యాపారాల్లో జోరు లాభం వృద్ధికి దోహదపడింది. కాగా, క్యూ4లో ఆర్‌ఐఎల్‌ ఆదాయం వార్షిక ప్రాతిపదికన దాదాపు 10 శాతం వృద్ధి చెంది రూ.2,64,573 కోట్లకు పెరిగింది. ఎబిటా 3.6 శాతం పెరుగుదలతో రూ.48,737 కోట్లుగా నమోదైంది.

గత ఆర్థిక సంవత్సరాని (2024-25)కి ఆర్‌ఐఎల్‌ లాభం 2.9 శాతం పెరిగి రూ.81,309 కోట్లుగా నమోదైంది. స్థూల ఆదాయం వార్షిక ప్రాతిపదికన 7.1 శాతం వృద్ధి చెంది రూ.10.71 లక్షల కోట్లకు పెరిగింది. 2024-25లో రూ.10 లక్షలకు పైగా నెట్‌వర్త్‌ సాధించిన తొలి కంపెనీ రిలయన్సే. గత ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ తన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.5.5 డివిడెండ్‌ను ప్రకటించింది. అలాగే, నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్ల (ఎన్‌సీడీ) జారీ ద్వారా రూ.25,000 కోట్ల సమీకరణ ప్రణాళికకు బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ వెల్లడించింది.

జియో ప్లాట్‌ఫామ్స్‌: టెలికాం సంస్థ రిలయన్స్‌ జియోతో పాటు ఇతర డిజిటల్‌ వ్యాపారాలను ఒకే గొడుగు కిందికి చేర్చి ఏర్పాటు చేసిన జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ క్యూ4 లాభం 26 శాతం వృద్ధితో రూ.7,022 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.26,120 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఈ మార్చి 31 నాటికి రిలయన్స్‌ జియో కస్టమర్లు 48.82 కోట్లకు చేరగా.. ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయం (ఆర్పూ) రూ.206.2కు పెరిగింది.

రిలయన్స్‌ రిటైల్‌: ఈ మార్చి త్రైమాసికంలో రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ లాభం 29 శాతం పెరిగి రూ.3,545 కోట్లకు చేరింది. గడిచిన మూడు నెలల్లో కొత్తగా 238 స్టోర్లను ప్రారంభించినట్లు, మొత్తం స్టోర్ల సంఖ్య 19,340కి చేరినట్లు కంపెనీ వెల్లడించింది.

ఓ2సీ: క్యూ4లో ఓ2సీ విభాగ ఆదాయం 15.4 శాతం వృద్ధితో రూ.1,64,613 కోట్లకు పెరిగినప్పటికీ, ఎబిటా మాత్రం 10 శాతం తగ్గి రూ.15,080 కోట్లకు పడిపోయింది. ముడి చమురు శుద్ధి, పెట్రోకెమికల్‌ మార్జిన్లు తగ్గడం ఇందుకు కారణమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఓ2సీ ఆదాయం 11 శాతం వృద్ధితో సరికొత్త రికార్డు స్థాయి రూ.6,26,921 కోట్లకు చేరింది.

ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌: మార్చి త్రైమాసికంలో ఈ విభాగ ఆదాయం 0.4 శాతం తగ్గి రూ.6,440 కోట్లకు, ఎబిటా 8.6 శాతం క్షీణించి రూ.5,123 కోట్లకు పరిమితమైంది. వార్షికాదాయం రూ.25,211 కోట్లు, ఎబిటా రూ.21,188 కోట్లుగా నమోదైంది. గత త్రైమాసికంలో కేజీ డీ6 బ్లాక్‌ నుంచి రోజుకు 26.73 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల సహజ వాయువును, 19 వేల పీపాల చమురును ఉత్పత్తి చేసినట్లు కంపెనీ తెలిపింది.

జియోస్టార్‌: డీస్నీ హాట్‌స్టార్‌, జియో సినిమా ఓటీటీ యాప్‌ల విలీనం ద్వారా ఏర్పాటు చేసిన జియోస్టార్‌ ఆదాయం క్యూ4లో రూ.10,006 కోట్లుగా, ఎబిటా రూ.774 కోట్లుగా నమోదైంది. జియోస్టార్‌ దేశంలో అతిపెద్ద ఓటీటీ వేదికగా అవతరించిందని, దీన్ని విడుదల చేసిన ఐదు వారాల్లోనే పెయిడ్‌ చందాదారుల సంఖ్య 10 కోట్లు దాటిందని రిలయన్స్‌ తెలిపింది.

Updated Date – Apr 26 , 2025 | 04:55 AM

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights