RE Sector Hiring: కేంద్ర పథకాలతో మరింత పుంజుకున్న పునరుత్పాదక ఇంధన రంగం.. భారీగా పెరుగుతున్న నియామకాలు!

Written by RAJU

Published on:

న్యూఢిల్లీ, మార్చి 26: జాబ్‌ మార్కెట్లో పునరుత్పాదక ఇంధన రంగం (renewable energy sector) హవా కొనసాగుతూనే ఉంది. 2025 ఏడాదికి కూడా అధిక సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తుందని టీమ్‌లీజ్ సర్వీసెస్ తాజా నివేదిక వెల్లడించింది. 2025లో ఈ రంగంలో ఏకంగా 18.9 శాతం నియామకాలు పెరుగుతాయని అంచనా వేసింది. పునరుత్పాదక ఇంధన రంగంలో నియామకాల జోరు 2024లో 23.7 శాతం ఉండగా.. 2023లో 8.5%, 2022లో 10.4%గా ఉంది. 2030 నాటికి 500 గిగావాట్స్ శిలాజేతర ఇంధన సామర్థ్యం పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో మునుముందు ఈ రంగంలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. ముఖ్యంగా పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, PM KUSUM, సోలార్ PV మాడ్యూల్ PLI వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు పునరుత్పాదక ఇంధన రంగంలో వృద్ధిని సాధించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ విధానాలు శ్రామిక శక్తి విస్తరణ, నైపుణ్య అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతున్నట్లు నివేదిక పేర్కొంది.

కంపెనీలు సామర్థ్యాన్ని పెంచడానికి డిజిటల్ ఆవిష్కరణలను ఎక్కువగా అవలంబిస్తున్నందున సౌర, పవన, హైబ్రిడ్ ఇంధన వ్యవస్థలలో సాంకేతికత ఆధారిత రోత్స్‌కు డిమాండ్‌ పెరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా సోలార్ ప్యానెల్ ఇన్‌స్టాలర్లు, ఎనర్జీ ఆడిటర్లు, ఆపరేషనల్ సపోర్ట్ నిపుణులతో పాటు, సోలార్ PV టెక్నీషియన్లు, రూఫర్లు, ప్రొడక్షన్ ఆపరేటర్లు, స్టోరేజ్ ఆపరేటర్లు, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్టుల అవసరం పెరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. దేశంలో సౌరశక్తి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక,యు తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ రంగంలో ఉపాధి కల్పనలో ముందంజలో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్ల సౌరశక్తి ప్లాంట్లు అత్యధికంగా ఉన్నాయి.

అంతేకాకుండా ఈ రంగంలో కాంట్రాక్టు ఉద్యోగుల్లో 44.1% మంది ఐటీఐ లేదా డిప్లొమా, 28.9% గ్రాడ్యుయేట్లు, 14.6% 12వ తరగతి ఉత్తీర్ణత, 4.1% పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. అధిక యువత ఈ రంగంలో పని చేస్తున్నారు. దాదాపు 54.8% మంది ఉద్యోగులు 26 నుంచి 35 ఏళ్ల వయస్సు గలవారే కావడం విశేషం. ఇక అనుభవజ్ఞులైన 35-40 ఏళ్ల వయసున్న నిపుణులు 16% మంది, 40 ఏళ్లకు పైబడిన ఉద్యోగులు 18.2% మంది మాత్రమే ఉన్నారు. భారత్‌ పునరుత్పాదక ఇంధన రంగం కీలకమైన మలుపు దశలో ఉందని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పి సుబ్బురతినం అన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ చొరవతోపాటు పెరుగుతున్న కార్పొరేట్ పెట్టుబడులు ప్రధాన కారణమని పేర్కొన్నారు. దీంతో ఈ రంగంలో ఉద్యోగాలు గణనీయంగా పెరుగుతున్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Subscribe for notification