అమరావతి, ఏప్రిల్ 27: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు కూటమి సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే లక్ష్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పోషక విలువలతో కూడిన కందిపప్పు, తృణధాన్యాలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాలే లక్ష్యంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూన్ నెల 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుఖాణాల్లో సరుకులతో పాటు సబ్సిడీపై కందిపప్పు, ఉచితంగా రాగులు ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
దీని కోసం రాబోయే మూడు నెలలకు సరిపడా కందిపప్పును, ఏడాదికి సరిపడా రాగులను సేకరించేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. రేషన్‌కార్డుదారులతోపాటు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఐసీడీఎస్ లబ్ధిదారులకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సరిపడేలా రూ.500 కోట్ల విలువైన 47,037 టన్నుల కందిపప్పు, రూ.100 కోట్లకు పైగా విలువైన 25 వేల టన్నుల రాగులు, 43,860 టన్నుల పంచదార సేకరణకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానంలో ఎన్‌ఈఎంఏల్ పోర్టల్ ద్వారా టెండర్లు ఆహ్వానించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 కోట్లకుపైగా రేషన్‌కార్డుదారులు ఉన్నారు. వీరందరికీ రేషన్ షాపుల ద్వారా అందించే బియ్యానికి బదులుగా రాగులను ఉచితంగా పొందే అవకాశం కూడా కల్పిస్తున్నారు.
దీని ప్రకారం ప్రతినెలా 20 కిలోల బియ్యం తీసుకునే కుటుంబం, రెండు కిలోల రాగులను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తే.. వారికి ఆ మేరకు బియ్యం కోటాలో తగ్గింపు ఉంటుంది. పౌరసరఫరాల శాఖ ప్రాథమిక అంచనా ప్రకార ఈ పథకం అమలుకు ఏడాదికి సుమారు 25 వేల మెట్రిక్ టన్నుల రాగులు అవసరం అవుతాయి. కందిపప్పును కిలో ప్యాకెట్ల రూపంలో రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులకు రవాణా చేయనున్నారు. అలాగే రాగులను క్వింటాళ్ల లెక్కన గోనెసంచుల్లో రవాణా చేయనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు ఏప్రిల్ 30తో ముగియనుంది. అంటే ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ గడువులోపు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవల్సి ఉంటుంది. ఈ-కేవైసీ చేయకపోతే రేషన్ సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. వచ్చే నెల నుంచి రేషన్ కార్డుల్లో మార్పు చేర్పులు, ఏటీఎం సైజులో, క్యూఆర్ కోడ్‌తో రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు కూడా.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.