- నాపై 15 సార్లు చెంపదెబ్బ కొట్టారు..
- ఆకలితో ఉంచి, ఖాళీ పేపర్లపై సంతకం చేయించుకున్నారు..
- అధికారులపై రన్యా రావు సంచలన ఆరోపణలు..

Ranya Rao Case: సినీనటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దుబాయ్ నుంచి రూ. 12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలను ప్రత్యేకమైన బెల్టు సాయంతో నడుముకు చుట్టుకుని తీసుకువస్తుండగా, బెంగళూర్ ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులకు పట్టుబడింది. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉంది. ఈ కేసులో గోల్డ్ మాఫియా ఇన్వాల్వ్ అయినట్లు భావిస్తుండటంతో ఇటు ఈడీ, అటు సీబీఐ రెండూ దర్యాప్తు చేస్తున్నాయి.
రన్యారావు సుపరిచిత సినీ నటి కావడం, కర్ణాటక డీజీపీ సవతి కూతురు కావడంతో ఈ అంశం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే, రన్యా రావు డీఆర్ఐ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. కస్టడీలో తనపై అధికారులు చేయిజేసుకున్నారని, పలుమార్లు చెంపదెబ్బ కొట్టారని, ఆహారం ఇవ్వకుండా, ఖాళీ పత్రాలపై బలవంతంగా సంతకం చేయించుకున్నారని ఆరోపించారు. డీఆర్ఐ అదనపు డైరెక్టర్ జనరల్‌కి రాసిన లేఖలో, రన్యా రావు మరోసారి తాను నిర్దోషిని సమర్థించుకుంది. తప్పుడు కేసులో ఇరికించినట్లు పేర్కొంది.
Read Also: CM Revanth Reddy: హద్దు దాటితే గుడ్డలు ఊడదీసి కొడతా.. సోషల్ మీడియా పోస్టులపై సీఎం ఫైర్
పదేపదే దాడి చేసినప్పటికీ డీఆర్ఐ అధికారులు తయారు చేసిన ప్రకటనపై తాను సంతకం చేయడానికి నిరాకరించానని ఆమె లేఖలో పేర్కొంది. చివరకు తీవ్ర ఒత్తిడితో 50-60 టైప్ చేసిన పేజీలు, 40 ఖాళీ తెల్ల పేజీలపై సంతకం చేయాల్సి వచ్చినట్లు చెప్పింది. తాను అరెస్ట్ అయిన క్షణం నుంచి తనపై అధికారులు శారీరక దాడి చేసినట్లు చెప్పింది. 10-15 సార్లు చెంపపై కొట్టారని, పదేపదే దాడులు చేసినప్పటికీ స్టేట్‌మెంట్‌పై సంతకం చేయడానికి నిరాకరించానని రన్యా వెల్లడించింది. కొన్ని రోజుల క్రితం రన్యా రావు కళ్ల కింద నల్లటి మచ్చలు ఉన్న ఫోటో ఒకటి వైరల్ అయింది.
తాను అంగీకరించకుంటే తన తండ్రి గుర్తింపును బయటపెడతానని ఒక డీఆర్ఐ అధికారి బెదిరించారని కూడా రన్యా ఆరోపించింది. ఈ కేసులో తన తండ్రి ప్రమేయం లేదని ఆమె చెప్పింది. మార్చి 3న సాయంత్రం 6.45 గంటల నుండి మార్చి 4న రాత్రి 7.50 గంటల వరకు నిర్బంధంలో ఉన్న సమయంలో తనకు ఉద్దేశపూర్వకంగా నిద్ర, ఆహారం నిరాకరించారని కూడా ఆమె పేర్కొన్నారు. మార్చి 10న కోర్టులో రన్యా రావు విలపించింది. డీఆర్ఐ అధికారులు వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఆపేసినప్పుడు మాటలతో దుర్భాషలాడుతున్నారని ఆరోపించింది.