ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది. ద్రోణి కారణంగా మరికొద్ది రోజులు ఈ రకమైన పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది. మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇటు తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాగల రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది.
మధ్య ఛత్తీస్గఢ్ నుండి అంతర్గత మహారాష్ట్ర వరకు కొనసాగిన ద్రోణి బలహీన పడింది.. ఈ రోజు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆ తరువాత క్రమేపి రెండు నుండి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ రోజు గరిష్టంగా అదిలాబాద్ లో 38.8 కనిష్టంగా హైదరాబాద్ లో 33.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, నిన్న తెలంగాణ లోని ఆదిలాబాద్, భద్రాచలం, ఖమ్మం, మహబూబ్ నగర్, లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది.
అకాల వర్షాలతో అన్నదాతకు నష్టం
ఇదిలా ఉంటే ఈ అకాల వర్షాలు అన్నదాతలకు కష్టాలను మిగిల్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వర్షాల కారణంగా వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో వర్షం, ఈదురుగాలులకు మొక్కజొన్న పంట పాడైపోయింది. మామిడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివేన గ్రామంలో వనగండ్ల వానతో వరి చేను దెబ్బతింది. చేతికొచ్చిన పంట పాడవడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు.
ఏపీలోనూ వర్షాల కారణంగా పంట నష్టం
అటు ఏపీలోనూ పలు జిల్లాలో అకాల వర్షం కారణంగా రైతులు పంట నష్టపోయారు. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో భారీగా అరటిపంటకు నష్టం వాటిల్లింది. 2 వేల ఎకరాల్లోని పంట దెబ్బతిందని రైతులు తెలిపారు. కడప, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోనూ పంట నష్టం సంభవించింది.
పంట నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష
అకాల వర్షాలు, వడగండ్ల వాన కారణంగా వివిధ జిల్లాల్లో జరిగిన పంటనష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. వడగళ్ల వాన కారణంగా కడప, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాల్లో 40 గ్రామాల్లో పంటనష్టం జరిగిందని అధికారులు వివరించారు. మొత్తం 1,364 మంది రైతులకు చెందిన 1,670 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించామని అధికారులు సీఎంకు తెలిపారు. రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..