హైదరాబాద్, మార్చి 20: తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే భానుడి ప్రతాపం మొదలైంది. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా వస్తుంది. దీంతో జనాలు అల్లాడిపోతున్నారు. మరో వైపు రైతులు కూడా పంటలకు సరిపడా నీరులేక అల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెల్పింది. తుఫాను సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ మహా నగరంలో జనవరి 22 నుంచి మూడురోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోయి చల్లగా మారుతుందని పేర్కొంది. ఇక తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో ఉరుములు, బలమైన ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు పడతాయని తెలిపింది.
మార్చి 22న తెలంగాణలోని నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని విడివిడిగా 40-50 కి.మీ వేగంతో మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మార్చి 21న ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని విడివిడిగా 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. 21, 22, 23 తేదీల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మార్చి 20, 24, 25 తేదీల్లో పొడి వాతావరణం ఉంటుందని అంచనా. రాబోయే రెండు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయని, ఆ తర్వాత మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని పేర్కొంది.
కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భానుడి భగభగలు ప్రారంభమయ్యాయి. బుధవారం రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా భీమారంలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా 41.3, నిజామాబాద్ 41.2, కొమురంభీం ఆసిఫాబాద్ 41.1, నాగర్‌కర్నూల్, జోగులాంబ-గద్వాల్ 41, జగిత్యాల జిల్లాల్లో 40.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.