ఓ వైపు వర్షాలు.. మరో వైపు ఎండలు.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్నట్లుగా మారింది వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండలు దంచికొడుతున్నాయి.. సాయంత్రం వేళ ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురుస్తోంది.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
తెలంగాణ వెదర్ రిపోర్ట్ ఇదే..
తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత, సాయంత్రం వాతావరణం చల్లబడి వర్షం కురుస్తోంది. నిన్న నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైంది. మధ్యాహ్నం నుంచి మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జనగామ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఖమ్మంలో వడగళ్ల వాన కురవడంతో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. మరోవైపు దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే 3 రోజులు వానలు
ఇక ఏపీ విషయానికి వస్తే.. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వచ్చే 3 రోజులు వానలు పడనున్నాయి. అలాగే వచ్చే నాలుగు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని.. ఆ తర్వాత స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో మరో నాలుగు రోజులు కొన్నిచోట్ల వర్షాలు, కొన్నిచోట్ల ఎండలతో విభిన్నమైన వాతావరణం ఉంటుంది.. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..