-
పలు జిల్లాల్లో వర్షం, వడగళ్లు
-
కాగజ్‌నగర్లో గోడకూలి వృద్ధుడి మృతి
-
నేడు, రేపు పలు జిల్లాలకు వర్షసూచన అప్రమత్తంగా ఉండండి
-
అధికారులకు సీఎం, సీఎస్ ఆదేశాలు
-
ఎం రేవంత్, సీఎస్ ఆదేశాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో పలు జిల్లాల్లో శుక్రవారం ఈదురు గాలులతో వర్షం పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం పలుచోట్ల గాలివానతో వర్షం కురిసింది. గాలి తీవ్రతకు వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కూలి పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని నవ్‌గామ్ బస్తీలో ఇంటి గోడ కూలి దౌలత్(65) అనే వృద్ధుడు మృతి చెందాడు. కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌లో రైతులు తీసుకువచ్చిన మక్కలు తడిసిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లాలోనూ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలోని కొన్ని మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. మామిడికాయలు నేల రాలిపోయాయి. పొట్ట దశలో ఉన్న వరి పంట నేలవాలింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం కురిసింది. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. కాగజ్‌నగర్ పట్టణంలోని ఫారెస్టు కార్యాలయం నుంచి ఎస్పీఎం గేటు వరకు చెట్లు విరిగి పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అకాల వర్షం పడింది. కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం పడింది. లింగంపేట మండలం పోతాయిపల్లి, లింగంపల్లి గ్రామాల్లో పిడుగు పాటుకు రెండు గేదెలు, మూడు మేకలు మృతి చెందాయి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు రైతులు తీసుకొచ్చిన పసుపు బస్తాలు వర్షానికి తడిసి ముద్దగా మారాయి. మెదక్ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం సాయంత్రం అక్కడక్కడా వర్షం కురిసింది. మెదక్ జిల్లా కేంద్రంలో పిడుగుపాటుకు బిల్డింగ్ పెచ్చులు ఊడి ఓ చిన్నారి గాయపడింది. కొల్చారం మండలం లో గాలి వానకు పలుచోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. రాష్ట్రంలో శని, ఆదివారాల్లో పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వడగళ్ల వానలు కొన్ని జిల్లాల్లో పడతాయని వెల్లడించింది. మేడ్చల్, సిద్దిపేట, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది. కాగా ఈదురు గాలులు, వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. వడగళ్ల వాన కురిసిన జిల్లాల్లో అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఆమె సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎండలూ మండుతున్నాయి
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలలో శుక్రవారం 39.3 డిగ్రీలు, అలంపూర్‌లో 39.2 డిగ్రీలు, ధరూర్‌లో 39.1 డిగ్రీలు, గద్వాల, మల్దకల్ కేటీదొడ్డి, అయిజలలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
వడదెబ్బ తగిలి ఉపాధి కూలీ మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండ లం ర్యాకల్‌లో చోటు చేసుకున్నది. ర్యాకల్ గ్రామానికి చెందిన బోయిని లచ్చమ్మ (52) శుక్రవారం ఉపాధి హామీ పనికి వెళ్లి వడదెబ్బ తగలడంతో స్పృహ తప్పి పడిపోయింది. నారాయణఖేడ్ వైద్యశాలకు తరలించగా.. అక్కడికిచేరుకునేసరికి మృతి చెందింది.
Updated Date – Mar 22 , 2025 | 04:22 AM