Railways: ట్రైన్‌లో ఫోన్‌ పోతే.. ఏం బాధపడకండి! ఇలా చేస్తే మీ ఫోన్‌ తిరిగి పొందొచ్చు!

Written by RAJU

Published on:

చాలా మంది ట్రైన్‌లో ప్రయాణిస్తున్న క్రమంలో మొబైల్‌ ఫోన్‌ను పోగొట్టుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని సార్లు ఫోన్లు చోరీకి కూడా గురవుతూ ఉంటాయి. ట్రైన్‌లో ఫోన్లు కొట్టేసే దొంగలు ఉంటారు. అయితే ట్రైన్‌లో ఫోన్‌ పోయినా, దొంగతనం జరిగినా.. ఇక చేసేందే లేక ప్రయాణికులు కొత్త ఫోన్‌ కొనుక్కునేవారు. కానీ, ఇకపై ఆ అవసరం లేదు.. ప్రయాణీకులు తమ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను తిరిగి పొందడంలో సహాయపడటానికి భారతీయ రైల్వే సరికొత్త నిర్ణయం తీసుకుంది. టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) భాగస్వామ్యంతో, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కు ప్రయాణీకులు రైల్ మదద్ ద్వారా లేదా 139కి డయల్ చేయడం ద్వారా పోగొట్టుకున్న ఫోన్‌ వివరాలు చెప్పేందుకు కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టింది.

FIR దాఖలు చేయకూడదనుకునే ప్రయాణీకులు సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు. RPF జోనల్ సైబర్ సెల్ ఫిర్యాదును నమోదు చేసి, మొబైల్‌ IMEI నంబర్‌ను బ్లాక్ చేస్తుంది, ఇది పనికిరానిదిగా చేస్తుంది. “కొత్త సిమ్ కార్డుతో పోగొట్టుకున్న ఫోన్ గుర్తించబడితే, దానిని సమీపంలోని RPF పోస్ట్‌కు తిరిగి ఇవ్వమని హెచ్చరిస్తుంది. అవసరమైన పత్రాలను సమర్పించడం ద్వారా నిజమైన యజమాని వారి ఫోన్‌ను తిరిగి పొందవచ్చు. నిబంధనలను పాటించని సందర్భాల్లో, RPF FIR దాఖలు చేసి, జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు” అని ఒక అధికారి తెలిపారు. CEIR పోర్టల్ అనేది పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను బ్లాక్ చేయడానికి, ట్రాక్ చేయడానికి రూపొందించిన ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్.

పోగొట్టుకున్న ఫోన్‌లను తిరిగి పొందడానికి, దొంగలించిన ఫోన్‌ను కనిపెట్టేందుకు, పునఃవిక్రయాన్ని నిరోధించడానికి ఈ పోర్టల్‌ను ఉపయోగించవచ్చు. ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR)లో మే 2024లో నిర్వహించిన పైలట్ కార్యక్రమం విజయవంతం అయిన తర్వాత అన్ని చోట్లా ఇప్పుడు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పైలెట్‌ ప్రాజెక్ట్‌లో చాలా మంది పోగొట్టుకున్న తమ మొబైల్ ఫోన్‌లను తిరిగి పొందడం, మొబైల్ దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో రైల్వే ప్రయాణీకులకు పోగొట్టుకున్న ఫోన్లు త్వరగా తిరిగి పొందడంలో ఇది సహాయపడుతుందని RPF నమ్మకంగా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి.

Subscribe for notification
Verified by MonsterInsights