Public Complaints: 3నెలల్లో ఫిర్యాదులు పరిష్కరించాలి

Written by RAJU

Published on:

రీసర్వేలో తప్పులు రాకూడదు

జేసీలు, ఆర్డీవోలకు రెవెన్యూ శాఖ ఆదేశాలు

అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వచ్చే 3నెలల్లో పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో ప్రజా సంతృప్తిని తీసుకురావాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఆర్‌.పి. సిసోడియా ఆదేశించారు. సమస్య పరిష్కారం కాలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే అధికారులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. జిల్లాల జేసీలు, ఆర్డీవోల సమావేశం విజయవాడలోని ఇరిగేషన్‌ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. రీసర్వేతో పాటు భూ సంబంధిత అంశాలపై ప్రత్యేక శిక్షణ, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. సిసోడియా మాట్లాడుతూ రీసర్వే, భూముల సమస్యలపై రైతులు ఇచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయికి వెళ్లి విచారించి, పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదులను ఆషామాషీగా తీసుకొని ఏదో పరిష్కరించామని కేసులు క్లోజ్‌ చేస్తే కుదరదని, అలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, రీసర్వేను జాగ్రత్తగా నిర్వహించాలని, తప్పులకు ఆస్కారం ఇస్తే కఠిన చర్యలు ఉంటాయని భూపరిపాలనా ప్రధాన కమిషనర్‌ జి.జయలక్ష్మి హెచ్చరించారు. ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో రైతుల సంతృప్తి ప్రధానమని, ఇదే లక్ష్యంగా అధికారుల పనితీరు ఉండాలని హితబోధ చేశారు.

త్వరలో గ్రామ రెవెన్యూ కోర్టులు

రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామ రెవెన్యూ కోర్టులు నిర్వహిస్తామని అదనపు సీసీఎల్‌ఏ, సర్వే డైరెక్టర్‌ ఎన్‌. ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు చేసుకోవాలని జేసీలకు సూచించారు. గ్రామ రెవెన్యూ కోర్టుకు తహశీల్దార్‌, ఆర్డీవో, ఇతర అధికారులు హాజరవుతారని, ప్రజల రెవెన్యూ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఈ విధానం ఉంటుందని వివరించారు,

ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Subscribe for notification